వెండితెర విలన్ తో వ్యక్తిగత అనుబంధం!
ఆ సమయంలో అమ్రిష్ పురి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నా? మరుక్షణమే అజయ్ దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరించేవారని గుర్తుచేసుకున్నారు.
By: Srikanth Kontham | 15 May 2026 1:00 AM ISTబాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగణ్ కెరీర్‌లో ఎందరో దిగ్గజ నటులతో పనిచేశారు. అయితే తన తొలి చిత్రం `ఫూల్ ఔర్ కాంటే` (1991) నుంచే దివంగత నటుడు అమ్రిష్ పురితో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి తాజాగా రివీల్ చేసారు. `అమ్రిష్ పురి అంటే వెండితెరపై భీకరమైన విలన్. కానీ నిజ జీవితంలో ఆయన అద్భుతమైన వ్యక్తి. తండ్రి సమానులుగా భావిస్తానన్నారు. సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటూ సహ నటులను ఆటపట్టిస్తుంటారు. అమ్రిష్ పురి వంటి సీనియర్ నటుడిని కూడా అజయ్ వదిలిపెట్టేవారు కాదుట. షూటింగ్ సమయంలో అజయ్ తరచూ అమ్రిష్ పురిని ఆటపట్టిస్తూ ఉండేవారట.
ఆ సమయంలో అమ్రిష్ పురి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నా? మరుక్షణమే అజయ్ దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరించేవారని గుర్తుచేసుకున్నారు. వారిద్దరి మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా? ఒక స్నేహితుడిలా ఎంతటి విషయమైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండేదని అజయ్ గుర్తు చసుకున్నారు. పరిశ్రమలో తాను పాద నమస్కారం చేసే ఏకైక వ్యక్తి అమ్రిష్ పురి అని అజయ్ దేవగణ్ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్రిష్ పూరిని ఒక నటుడిగానే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించేవాడినన్నారు. `అమ్రిష్ జీ చనిపోయి ఉండవచ్చు. కానీ నా హృదయంలో ఆయన జీవించే ఉంటారు.
ఆయన ఇచ్చిన ఎన్నో విలువైన సలహాలు వృత్తివ్యక్తిగత జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఆపద వచ్చినా? ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా లేదా ఎవరైనా మరణించినా? అందరికంటే ముందుగా అక్కడ ప్రత్యక్షమయ్యే వ్యక్తి ఆయనే అని అజయ్ ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
తమ తొలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా అజయ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సి.జి.ఐ వంటి సాంకేతికత లేకపోయినా? ప్రాణాలకు తెగించి చేసిన బైక్ స్టంట్స్ సమయంలో అమ్రిష్ పురి తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పారు.
ఈ అనుబంధం వల్లే `ఫూల్ ఔర్ కాంటే` తర్వాత కూడా ఇద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఒక నటుడిగా అమ్రిష్ పురి స్థానం భర్తీ చేయలేనిది. ఆయనలాంటి క్రమశిక్షణ గల వ్యక్తిని చూడటం అరుదు. షూటింగ్ సెట్‌కు అందరికంటే ముందుగా రావడం పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వంటి విషయాల్లో ఆయన అందరికీ ఆదర్శమని చెప్పారు. అజయ్ తన వ్యక్తిగత విషయాలను పెద్దగా బయట పెట్టకపోయినా? అమ్రిష్ పురి గురించి మాత్రం ఎంతో హుందాగా, గౌరవంగా మాట్లాడటం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెబుతోంది. మొత్తానికి అజయ్ దేవగణ్ - అమ్రిష్ పురిల మధ్య గురుశిష్యుల బంధమే ఉందని తెలుస్తోంది. పెద్దలను గౌరవిస్తూనే వారితో స్నేహపూర్వకంగా ఎలా ఉండాలో? ఎలా మెలగాలో? అజయ్ మాటలు నిరూపిస్తున్నాయి.
