'దృశ్యం 3' అక్కడా సర్వం సిద్దమా?
ఈ ప్రాంచైజీని రీమేక్ చేయడంలో ఇద్దరూ ఇద్దరు. తమదైన శైలి మేకింగ్ తో సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు. దీంతో ఎవరు తుదిగా ఎంపికయ్యారు? అన్నది చూడాలి.
By: Sivaji Kontham | 25 Nov 2025 4:00 AM ISTమాలీవుడ్ సంచలన ప్రాంచైజీ `దృశ్యం` నుంచి పార్ట్ 3 మాతృకలో మొదలైన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా బాలీవుడ్ వెర్షన్ కూడా పట్టాలెక్కడానికి సిద్దమవుతోంది. పార్ట్ 3 లో కూడా అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే దర్శకుడు ఎవరు? అన్నది మాత్రం ఇంత వరకూ ఖరారు కాలేదు. హిందీ వెర్షన్ మొదటి భాగానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించాడు. 62 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ భాగం దాదాపు 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. అటుపై రెండవ భాగాన్ని అభిషేక్ పాఠక్ తెరకెక్కించాడు.
రెండు భాగాలు 500కోట్ల వసూళ్లతో:
70 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు హిందీ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరించారో అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో `దృశ్యం 3` కోసం ఆడియన్స్ మూడేళ్లగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్ లోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణలతో సాధ్య పడలేదు. దీంతో వచ్చే నెల 12 న ముంబైలోని యశ్ రాజ్ ఫిలిం స్టూడియలో మొదలు పెట్టాలని సర్వం సిద్దం చేస్తున్నారు. అయితే దర్శకుడిపై మాత్రం ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. నిషికాంత్ కామత్... అభిషేక్ పాఠక్ లలో ఎవర్ని ఫైనల్ చేసారు? అన్నది తేలాల్సి ఉంది.
డైరెక్టర్ పై క్లారిటీ ఎప్పుడు?
ఈ ప్రాంచైజీని రీమేక్ చేయడంలో ఇద్దరూ ఇద్దరు. తమదైన శైలి మేకింగ్ తో సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు. దీంతో ఎవరు తుదిగా ఎంపికయ్యారు? అన్నది చూడాలి. అలాగే మొదటి భాగాన్ని పనోరమా స్టూడియోస్ నిర్మించగా వయోకామ్ 18 స్టూడియోస్ పంపిణి చేసింది. రెండవ భాగం నిర్మాణంలో వయోకామ్ తో పాటు టీ సీరిస్ కూడా భాగమైంది. మరి మూడవ భాగం నిర్మాణంలో ఇవే సంస్థలు ముందుకొస్తున్నాయా? కొత్త సంస్థకు రైట్స్ అమ్మేసారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవ హక్కులైతే? పనోరమా స్టూడియోస్ వద్దనే ఉన్నాయి.
వచ్చే ఏడాది మూడు సినిమాలతో:
ప్రస్తుతం అజయ్ దేవగణ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే `ధమాల్ 4` చిత్రీకరణ ముగించారు. `రేంజర్` షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది మినహా మరే కొత్త సినిమా ఆన్ సెట్స్ లో లేదు. `దృశ్యం 3` మొదలు పెడితే? 2026లో ఆ చిత్రం రిలీజ్ కానుంది. `రేంజర్`, `ధమాల్ 4` కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. ఇతర భాషల్లో కూడా అజయ్ దేవగణ్ కు అవకాశాలు వస్తున్నా? సెలక్టివ్ గా ఉంటున్నారు. ఇప్పటికే `ఆర్ ఆర్ ఆర్` తో టాలవుడ్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
