Begin typing your search above and press return to search.

డెబ్యూ హీరోపై దర్శకుడు అజయ్ భూపతి ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు!

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. నటులను తెరపై ఆవిష్కరించే విధానంలో ఎప్పుడూ విభిన్నంగా ఉంటారు.

By:  Sivaji Kontham   |   28 July 2026 12:06 PM IST
డెబ్యూ హీరోపై దర్శకుడు అజయ్ భూపతి ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు!
X

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. నటులను తెరపై ఆవిష్కరించే విధానంలో ఎప్పుడూ విభిన్నంగా ఉంటారు. ఏ దర్శకుడైనా తన కథకు సరిపోయే కథానాయకుడిని ఎంచుకున్నప్పుడు.. అతడిని పాత్రకు తగ్గట్టు ఎలా మలుచుకోవాలో ముందే ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండటం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఘట్టమనేని వారసుడు జయకృష్ణను వెండితెరకు పరిచయం చేస్తున్న అజయ్ భూపతి మాటలు చూస్తుంటే... ఒక నటవారసుడిని సరైన రీతిలో మలిచే సత్తా ఆయనకు ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ''డెబ్యూ హీరో జయకృష్ణ మొదటి రోజు సెట్స్‌కు వచ్చినప్పుడు ఎంత ప్రిపేర్ అయి వచ్చాడని మీకు అనిపించింది?`` అని జర్నలిస్ట్ అడగ్గా... అజయ్ భూపతి చాలా ఓపెన్‌గా సమాధానమిచ్చారు. ఆ కుర్రాడు అంతకుముందు ఎక్కడెక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడు... ఏం ప్రిపేర్ అయ్యాడు? అనే విషయాలు నేను అసలు పట్టించుకోలేదు. నా కథకు నటుడు ఓకే అనుకున్నాక... ఆ పాత్రలోకి అతడిని ఎలా తెచ్చుకోవాలి... ఎంతవరకు మార్చుకోవాలి? అనేది నాకు బాగా తెలుసు. ఆ క్లారిటీతోనే నేను జయకృష్ణతో పని చేయించుకున్నాను! అని తన కాన్ఫిడెన్స్‌ను వ్యక్తపరిచారు.

జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి మాట్లాడుతున్నప్పుడు టీజర్‌లోని ఒక యాక్షన్ సీక్వెన్స్ షాట్‌ను ఇంటర్వ్యూయర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గాలిలో ఎగిరి కాల్చే సన్నివేశంలో జయకృష్ణ కళ్లలోని ఇంటెన్సిటీ సరిగ్గా మహేష్ బాబు ని గుర్తుచేసిందని...ఈ కుర్రాడు పరిశ్రమను ఏలడానికే వచ్చాడనిపించిందని కాంప్లిమెంట్ ఇచ్చారు. దానికి అజయ్ భూపతి స్పందిస్తూ... జయకృష్ణ కళ్లు, ఆ కళ్లలోని తీవ్రత చాలా బాగుంటాయని అంగీకరించారు.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో కూడా చాలా లాంగ్ షాట్లలో జయకృష్ణ పరిగెత్తే విధానం... బాడీ లాంగ్వేజ్ అచ్చం మహేష్ బాబు లాగే అనిపించిందని అజయ్ భూపతి త‌న హీరోపై అభిమానం కురిపించారు. జయకృష్ణతో ఒకరోజు నవ్వుతూ అన్నాను.. నేను మహేష్ గారితో సినిమా చేయకపోయినా... ఆయన ఫ్యామిలీ నుంచే వచ్చిన నిన్ను చూస్తుంటే ఆ లోటు తీరిపోయినట్టు ఉందన్నాను! అని సరదా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జయకృష్ణ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో ఆ పోలికలు రావడం సహజమేనని తెలిపారు.

మొత్తానికి ఒక కొత్త నటుడి గ‌త శిక్ష‌ణ‌లు లేదా అనుభవాన్ని పక్కన పెట్టి... తన క్రియేటివిటీతో అతడిలోని నటుడిని బయటకు తీసిన అజయ్ భూపతి కాన్ఫిడెన్స్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్, కళ్లలోని ఇంటెన్సిటీ ప్రొఫెషనల్‌గా ఉన్నాయని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత జయకృష్ణ టాలెంట్ ఏంటో క‌చ్చితంగా గుర్తిస్తారని..ఈ సినిమాతో డెబ్యూ హీరోకి మంచి పునాది పడుతుందని అజయ్ భూపతి నమ్మకంతో ఉన్నారు. జూలై 30న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.