గెస్ చేయండి... మంగళవారం మేకర్ ఏం చేయబోతున్నాడు?
మంగళవారం సినిమా తర్వాత అజయ్ భూపతి వద్దకు పలు ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడు.
By: Ramesh Palla | 5 Nov 2025 12:13 PM IST2018లో ఆర్‌ఎక్స్ 100 వంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ విజయంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుని 2021లో మహాసముద్రం పేరుతో ఒక మల్టీస్టారర్ మూవీని తీసుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్‌గా తీవ్రంగా నిరాశ పరిచింది. దర్శకుడిగానూ ఆయన క్రేజ్ మసకబారింది. దాంతో మూడో సినిమా విషయంలో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదుగో ఇదుగో అని దాదాపు ఏడాది పాటు ఆయన మూడో సినిమా విషయంలో చర్చలు జరిపాడు. చివరకు తన మొదటి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ తో మంగళవారం సినిమాను రూపొందించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం సినిమా నటిగా పాయల్‌కి దర్శకుడిగా అజయ్ భూపతికి మంచి పేరు తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మంగళవారం సినిమా తర్వాత...
మంగళవారం సినిమా తర్వాత అజయ్ భూపతి వద్దకు పలు ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడు. 2023లో మంగళవారం సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చి ఏడాదికి పైగానే పూర్తి అయింది. అయినా ఇప్పటి వరకు అజయ్ భూపతి తదుపరి సినిమా ప్రకటించలేదు. ఆ మధ్య ఒక యంగ్ స్టార్ హీరోతో సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లే అని తేలింది. ఆ తర్వాత మరో హీరోతో ఈయన చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఒక్క హీరోతోనే కాకుండా చాలా మంది హీరోలతో అజయ్ భూపతి చర్చలు జరపడం జరిగింది. ఆయన తదుపరి సినిమా సాదా సీదాగా ఉండదని, కచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్‌ను అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు బలంగా సోషల్ మీడియా ద్వారా లీక్ లు ఇస్తూ ఉన్నారు. దాంతో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఎక్స్‌లో ట్వీట్ చేసిన అజయ్ భూపతి...
అజయ్ భూపతి ఎట్టకేలకు ఎక్స్ ద్వారా తన తదుపరి సినిమా గురించి చిన్న హిట్ ఇచ్చాడు. అతి త్వరలోనే తన కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని ఎక్స్ లో ట్వీట్ చేశాడు. త్వరలో ట్రిగ్గరింగ్ ప్రకటనకు సిద్ధంగా ఉండండి అంటూ గన్, హార్ట్, ఫైర్ ఈమోజీలను షేర్ చేశాడు. దాంతో యాక్షన్ లవ్ స్టోరీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా తన తదుపరి సినిమాకు సంబంధించిన పోస్ట్‌లతో మీ టైమ్‌లైన్‌ను బ్లాస్టింగ్ చేయండి అన్నాడు. చివరకు తన సినిమా ఏంటి అనేది ఊహించడానికి ప్రయత్నించండి అంటూ తన ట్వీట్ ను ముగించాడు. దాంతో అజయ్ భూపతి యొక్క సినిమా గురించి, ఆయన తదుపరి సినిమా చేయబోతున్న హీరో గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఎక్స్ పోస్ట్‌కి ఎవరికి తోచిన విధంగా వారు పోస్ట్‌లు చేస్తూ అంచనా వేస్తున్నారు.
ఏ హీరోతో అజయ్ భూపతి తదుపరి సినిమా...?
ఇప్పటి వరకు అజయ్ భూపతి సినిమా ఏ హీరోతో అనే విషయంలో క్లారిటీ లేదు. చాలా మంది హీరోలతో సినిమాల విషయంలో చర్చలు జరిగాయి. అయితే చివరికి ఏ హీరో ఈయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆ స్పష్టత త్వరలో అంటూ స్వయంగా అజయ్ భూపతి ప్రకటించాడు. దాంతో మంచి సమయం చూసి ఆయన నుంచి ఏ క్షణంలో అయినా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అజయ్ భూపతి నాల్గవ సినిమా కచ్చితంగా మరో ఆర్‌ఎక్స్ 100 లేదా మంగళవారం సినిమా మాదిరిగా ఉంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికి అజయ్ భూపతి ఒక సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయమై తుది చర్చల్లో ఉన్నాడు. ఆ స్క్రిప్ట్ పని పూర్తి చేస్తే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2026లో అజయ్ భూపతి దర్శకత్వంలో నాల్గవ సినిమా రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
