ట్రైలర్ చూసి 'సూపర్భ్' అంటూ మహేష్ రిప్లయ్ ఇచ్చారు: దర్శకుడు అజయ్ భూపతి!
విజయవాడలో జరిగిన `శ్రీనివాస మంగాపురం` చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది.
By: Sivaji Kontham | 13 July 2026 9:15 AM ISTవిజయవాడలో జరిగిన `శ్రీనివాస మంగాపురం` చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ (విజయ్ కృష్ణ) అద్భుతంగా నటించాడని ఆయన కొనియాడారు. ఇది ఒక డెబ్యూ హీరో చేస్తున్న మొదటి సినిమా లాగా అస్సలు ఉండదని.. జయకృష్ణ నటన ఆ స్థాయిని దాటి మెప్పించిందని స్పష్టం చేశారు. యాథృచ్ఛికంగా తన మొదటి సంచలన చిత్రం `ఆర్‌ఎక్స్ 100` (RX 100) విడుదలై సరిగ్గా ఈరోజుకి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంలో... ఈ కొత్త సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.
కృష్ణ ఫ్యాన్స్ - మహేష్ బాబు ఫ్యాన్స్ సమక్షంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని అజయ్ భూపతి అన్నారు. ప్రత్యేకించి విజయవాడ లాంటి ఊరు వచ్చి ఇక్కడి మాస్ ఇజం, ఫ్యాన్ ఇజం ఎలా ఉంటుందో కళ్లారా చూడటం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఈ వేదికపై సినిమాను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటూ.. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరో జయకృష్ణ, హీరోయిన్ రాషాతో పాటు ఇతర నూతన నటీనటులకు ప్రేక్షకుల ఆశీస్సులు అవసరమని కోరారు.
సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇందులో పాటలు-ఫైట్స్ అద్భుతంగా ఉంటాయని మాటిచ్చారు. ఇప్పటికే విడుదలైన `మంగా మంగా` పాట ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందని.. మిగిలిన పాటలు, అల్లేల్లే సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తాయని చెప్పారు. అంతేకాకుండా జయకృష్ణ సినిమాలో ఫైట్స్ ఇరగదీశాడని, యాక్షన్ ఎపిసోడ్స్ మామూలుగా ఉండవని హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో నటుడు మోహన్ బాబు ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని అజయ్ భూపతి వెల్లడించారు.
ఈ చిత్రం పూర్తిగా రస్టిక్-రా ఎలిమెంట్స్ తో సాగుతున్నా.. అద్భుతమైన ప్రేమకథ రక్తి కట్టిస్తుందని అజయ్ భూపతి తెలిపారు. థియేటర్లలో ఈ కథ యూత్‌కి విపరీతంగా నచ్చుతుందని... అలాగే స్క్రీన్ మీద జయకృష్ణ - రాషాల పెయిర్ అద్భుతంగా కుదిరిందని... వీరిద్దరి కాంబినేషన్‌ను ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు.
అన్నిటికంటే ముఖ్యంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ చూసి ఇచ్చిన రిప్లయ్ గురించి అజయ్ భూపతి సగర్వంగా వెల్లడించారు. తాము ఉదయమే మహేష్ బాబు గారికి ట్రైలర్ పంపించామని.. దానికి ఆయన స్పందిస్తూ `సూపర్బ్` అని టెక్స్ట్ మెసేజ్ పంపడమే కాకుండా.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నాలుగు రెడ్ లవ్ సింబల్స్ (గుర్తులు) పంపించారని వెల్లడించారు. మహేష్ బాబు నుండి అలాంటి మెసేజ్ రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తాను ఎప్పుడూ కేవలం అభిమానుల కోసమే సినిమాలు చేయలేదని.. కానీ మొదటిసారిగా ఈ సినిమాలో ఫ్యాన్స్ ఆశించే ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ పెట్టానని... సినిమా కచ్చితంగా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, ఆది శేషగిరిరావు, రాషా తడానీ తదితరులు పాల్గొన్నారు.
