హిట్ మెషీన్ ఫోన్ చేస్తే గూగుల్ చేసిందంట!
వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు అనిల్ రావిపూడి.
By: Tupaki Entertainment Desk | 4 Feb 2026 1:00 AM ISTవరుస బ్లాక్ బస్టర్ హిట్‌లతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు అనిల్ రావిపూడి. సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లో హిట్‌మెషీన్. టాప్ స్టార్లతో చెప్పి మరీ బ్లాక్ బస్టర్ హిట్‌లు అందించి సరికొత్త రికార్డుని సొంతం చేసుకున్నారు. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` అంటూ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఊహించని విధంగా రూ.300 కోట్ల పైచిలుకు వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `మన శంకరవరప్రసాద్‌గారు` కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేసి మెగాస్టార్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించింది. వింటేజ్ చిరుని పరిచయం చేసిన తీరు, ఫ్యామిలీ ఎమోషన్స్, అంతే మోతాదులో కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. చిరు సినిమాకు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా 2026 ప్రారంభంలో అత్యధిక వసూళ్లని రాబట్టిన తొలి ప్రాంతియ చిత్రంగా రికార్డు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ఫోన్ చేస్తే గూగుల్ చేసిందంట హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన `సంక్రాంతకి వస్తున్నాం` సినిమాతో భాగ్యంగా తనదైన మార్కు నటనతో గోదావరి యాసతో ఆకట్టుకుని సినిమా విజయంలో తనదైన పాత్ర పోషించింది ఐశ్వర్య రాజేష్. అయితే తనకు ఈ సినిమా చేసే వరకు అనిల్ రావిపూడి ఎవరో తెలియదని చెప్పి షాక్ ఇచ్చింది. ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఐశ్వర్యా రాజేష్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి.
`సుడల్` సిరీస్‌లో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి తనకు కాల్ వచ్చిందట. `అమ్మా నేను అనిల్ రావిపూడిని డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను` అని చెప్పగానే తను ఎవరన్నది అంత వరకు తనకు తెలియకపోవడంతో అనిల్ గురించి గూగుల్ చేసిందట. తన గురించి తెలుసుకున్నాక చెప్పండి సార్ అని అడగడంతో `ఆడిషన్‌కి వస్తావా` అని అనిల్ అడిగాడట. `ఆయన ఆడిషన్ అనగనే నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఆడిషన్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తెలుగు సినిమాలో ఆడిషన్ అనే సరికి కొంత కంగారు పడ్డాను.
హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఆడిషన్ ఇవ్వాల్సిందే. కానీ తెలుగు సినిమాకు ఆడిషన్ అనగానే షాక్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వెంటనే ఆయనకు ఓకే చెప్పి ఆడిషన్ కోసం హైదరాబాద్ వచ్చేసి ఆయనని కలిశాను. లుక్ టెస్ట్‌తో పాటు నాతో రెండు, మూడు డైలాగ్‌లు చెప్పించారు. స్టోరీ చెప్పిన తరువాత అనిల్ గారు ఇది నేను చేయలేను. అసలు నేను చేసిన సినిమాలు మీరు చూశారా? అన్ని సాడ్‌గా ఉండే క్యారెక్టర్లే అన్నాను. దానికి ఆయన నువ్వు చేయగలవు..నువ్వు చెయ్ ఐషూ నేను పక్కనుండి చేయిస్తా అని నాతో చేయించారు..అది ఓ మ్యాజిక్‌లా జరిగి అది నాకు తెలుగులో బిగ్ బ్రేక్ ఇచ్చింది` అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్యా రాజేష్.
