Begin typing your search above and press return to search.

ఐశ్వర్య ఫోటోలు వాడకూడదు.. హైకోర్టు సంచలన తీర్పు!

ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఎవరు కూడా ఆమె ఫోటోలు వాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

By:  Madhu Reddy   |   11 Sept 2025 3:53 PM IST
ఐశ్వర్య ఫోటోలు వాడకూడదు.. హైకోర్టు సంచలన తీర్పు!
X

సాధారణంగా సెలబ్రిటీలకు పబ్లిక్ లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను.. ఇటు ఎన్నో బ్రాండ్ ఉత్పత్తులు తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా నియమిస్తూ వారి క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం వీరి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. నేరుగా వీరి ఫోటోలను ఉపయోగించి క్యాష్ పొందుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇదంతా బాగానే ఉన్నా తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను ఉపయోగించి ,తమ పరువుకు భంగం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అంటూ సెలబ్రిటీలు వాపోతున్నారు. అంతేకాదు ఉపయోగించని చోట ఫోటోలను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఫలితంగా తమ ఇమేజ్ తగ్గిపోతోందని కొంతమంది కోర్ట్ ను కూడా ఆశ్రయిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచ మాజీ విశ్వసుందరి, ప్రముఖ స్టార్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా మధ్యవర్తి సహాయంతో కోర్టును ఆశ్రయించగా.. ఏకంగా ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇకపై ఎవరైనా ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఉపయోగిస్తే శిక్ష తప్పదు అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయంలోకి.. తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఉపయోగిస్తున్నారు అంటూ ఢిల్లీ హైకోర్టును ఇటీవల ఐశ్వర్యరాయ్ మధ్యవర్తి ద్వారా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి తీర్పునిచ్చింది.

ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఎవరు కూడా ఆమె ఫోటోలు వాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఐశ్వర్యరాయ్ ఫోటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవానికి, ప్రతిష్టకు దెబ్బ కలిగించినట్లేనని కోర్టు తెలిపింది. అంతేకాదు ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.

అలాగే విచారణలో భాగంగా ఐశ్వర్యరాయ్ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం.. అందులో గుర్తించిన యు ఆర్ ఎల్ ను వెంటనే తొలగించి బ్లాక్ చేయాలని ఈ కామర్స్ వెబ్సైట్లను, గూగుల్ సహా ఇతర ప్లాట్ఫాములకు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందిన 72 గంటల్లోపే పిటిషన్ లో ఐశ్వర్య పేర్కొన్నట్టుగా యుఆర్ఎల్ బ్లాక్ చేయాలని.. ముఖ్యంగా వీటిని ఏడు రోజుల్లో బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. ఇక తదుపరి విచారణను జనవరి 15 కు వాయిదా వేయడం జరిగింది.

ఇక అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. గత రెండు రోజుల క్రితం ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథీ.. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహాయంతో ఐశ్వర్య ఫోటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. నా క్లైంట్ పే,రు ముఖం వాడుకుని డబ్బు సంపాదిస్తున్నారు.' ఐశ్వర్య నేషన్ వెల్త్ ' అనే ఒక సంస్థ తమ లెటర్ హెడ్ పై ఆమె ఫోటోని ముద్రించి, ఆమెను ఆ సంస్థకు చైర్ పర్సన్ గా తప్పుగా చూపించింది" అంటూ కోర్టును ఆశ్రయించారు. మరికొంతమంది ఐశ్వర్యరాయ్ ఫోటోలతో టీ షర్ట్లు, వాల్ పేపర్లు అమ్ముతూ ఆమె హక్కులను ఉల్లంఘిస్తున్నారని కూడా వాదించారు. ఇక దీంతో విచారణ జరిపిన కోర్టు ఆమె ఫోటోలు వాడకూడదని తీర్పు ఇస్తూనే.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.