ఆ అదృష్టం నాకే దక్కింది..
తాజాగా ఒక వేదికపై మెరిసిన ఈమె ఆ అదృష్టం తనకే దక్కింది అంటూ కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 5 Dec 2025 11:37 AM ISTమాజీ విశ్వసుందరి ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్న ఈమె.. తన నటనతో ఇండియన్ సినీ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా ప్రేక్షకుడు ఈమె కోసం తమ హృదయంలో గుడి కట్టేసారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఐశ్వర్య రీ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడగా.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఆ కోరికను కాస్త నెరవేర్చింది ఐశ్వర్య.
తాజాగా ఒక వేదికపై మెరిసిన ఈమె ఆ అదృష్టం తనకే దక్కింది అంటూ కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో వేడుక ఏదైనా తన మార్కు చూపించి అందర్నీ ఆకర్షించే ఐశ్వర్య తాజాగా రెడ్ సీ ఫెస్టివల్ లో బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో అద్భుతంగా కనిపించి మరోసారి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ వేదికపై తన కెరియర్ గురించి మాట్లాడుతూ.."1994లో అనుకోకుండా ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్నాను. అయితే కచ్చితంగా టైటిల్ నాకే రావాలని అనుకోలేదు. అంతర్జాతీయ పోటీలో భారత్ కి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావించే నేను ఆ పోటీలలో పాల్గొన్నాను.
అయితే ఆ సమయంలో భారతీయుల గురించి ప్రపంచ దేశాలలో ఉన్న చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనే విషయం నన్ను మరింతగా ఆశ్చర్యపరిచింది. అందుకే ఎలాగైనా సరే మన దేశం యొక్క విలువను ప్రపంచ దేశాలకు తెలియజేసేలా ఈ సందర్భాన్ని వేదికగా చేసుకొని మన దేశం గురించి గొప్పగా చెప్పగలిగాను. అలా మన దేశం గురించి వివరించే అవకాశం నాకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది.
అలాగే మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోవడంపై కూడా స్పందిస్తూ.. "ప్రపంచ సుందరిగా టైటిల్ గెలవడంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. అలా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్ అనే సినిమాలో అవకాశం లభించింది. అదే సంవత్సరం బాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ముఖ్యంగా దేవదాస్ సినిమా నా జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాతే కథల ఎంపిక విషయంలో అవగాహన వచ్చి ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాను. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను.. మీ అందరికీ తెలుసు" అంటూ తెలిపింది. అంతేకాదు తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసింది ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
