Begin typing your search above and press return to search.

నేటి డిజిట‌ల్ యుగంలో పిల్ల‌ల్ని కాపాడ‌ట‌మెలానో ఐశ్వ‌ర్యారాయ్ టిప్స్!

రెండవ పాఠం.. `తెరల కంటే బాల్యం పెద్దదిగా ఉండాలి`. పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచడం అంటే కేవలం వారిపై ఆంక్షలు విధించడం మాత్రమే కాదు..

By:  Sivaji Kontham   |   31 May 2026 5:00 AM IST
నేటి డిజిట‌ల్ యుగంలో పిల్ల‌ల్ని కాపాడ‌ట‌మెలానో ఐశ్వ‌ర్యారాయ్ టిప్స్!
X

ఈరోజుల్లో త‌ల్లి గ‌ర్భం నుంచి ఆండ్రాయిడ్‌లు, యాపిల్ ఫోన్లు పుడుతున్నాయి! ఇలా అండాశ‌యం నుంచి బిడ్డ‌ బ‌య‌ట‌కు రాగానే మొద‌ట‌గా ట‌చ్ చేసేది ట‌చ్ ఫోన్ నే! అనే ఒక అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ లోని సెటైర్ ని మీరంతా గ‌మ‌నించే ఉంటారు. ఇది ఆధునిక ప్ర‌పంచ ప‌ర్య‌వ‌సానం. దీనికి త‌గ్గ‌ట్టే పిల్ల‌ల ఎదుగుదల‌ కూడా అత్యంత‌ ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ఆట స్థ‌లంతో ప‌నిలేని ఆండ్రాయిడ్లు లేదా ఆపిల్ ఐఫోన్లులా పిల్ల‌లు మూడీగా, ఎవ‌రికీ స్పందించ‌ని దుస్థితికి చేరుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప్ర‌తిష్ఠాత్మ‌క రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్-2026 వేడుక‌లో జరిగిన ఒక ప్రత్యేక చిట్‌చాట్‌లో ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యరాయ్ పిల్ల‌ల్ని ఎలా పెంచాలో చెప్పిన టిప్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీసాయి. ఇక్క‌డ ఐశ్వ‌ర్యారాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య గురించి ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో ఆరాధ్య పేరుతో చెలామణి అవుతున్నవన్నీ నకిలీ ప్రొఫైల్స్ అని తేల్చి చెబుతూ.. తన కుమార్తెకు అసలు సోషల్ మీడియాలోనే ఖాతా లేదని తెలిపారు. మరో ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ సైతం ఆరాధ్యకు కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదని వెల్లడిస్తూ.. చిన్నారిని ఇంత క్రమశిక్షణతో పెంచుతున్న పూర్తి క్రెడిట్ ఐశ్వర్యరాయ్‌కే ఇచ్చారు. సెలబ్రిటీ ప్రపంచపు తళుకుబెళుకులకు నిరంతర పబ్లిసిటీకి దూరంగా అత్యంత సహజమైన వాతావరణంలో పిల్లలను ఎలా పెంచవచ్చో నిరూపించిన ఐశ్వర్యరాయ్ పేరెంటింగ్ శైలికి భ‌ర్త అభిషేక్ గొప్ప‌గా కితాబునిచ్చారు. దీని నుంచి నేటి తరం తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఇలా ఉన్నాయి.

మొదటి పాఠం.. `డిజిటల్ యాక్సెస్‌ను ఒక ఛాయిస్‌గా మార్చాలి తప్ప అలవాటుగా కాదు`. ఈ రోజుల్లో పిల్లలకు ఒక నిర్దిష్ట వయసు రాగానే.. వారు అడగ్గానే ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. కానీ ఐశ్వర్యరాయ్ విధానం ప్రకారం.. పిల్లలు మానసికంగా ఎదిగి ఇంటర్నెట్ ప్రపంచాన్ని అర్థం చేసుకునే స్థాయికి వచ్చేవరకూ డిజిటల్ యాక్సెస్‌ను వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా టీనేజ్ వయసులో పిల్లలు ఇతరులతో పోలికలు.. సామాజిక ఒత్తిడి- పబ్లిక్ స్క్రూటినీకి లోనయ్యే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ ప్రపంచంలోకి వారి ఎంట్రీని కాస్త నెమ్మదింపజేయడం ద్వారా వారి అమాయకమైన బాల్యాన్ని సంరక్షించవచ్చు.

రెండవ పాఠం.. `తెరల కంటే బాల్యం పెద్దదిగా ఉండాలి`. పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచడం అంటే కేవలం వారిపై ఆంక్షలు విధించడం మాత్రమే కాదు.. వారిలో ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను, కుటుంబంతో గడిపే సమయాన్ని కాపాడటం. నిరంతరం కెమెరాల నిఘాలో ఇతరులు చూస్తున్నారనే అభద్రతా భావంలో కాకుండా సాధారణ ఆఫ్‌లైన్ జీవితాన్ని ఆస్వాదించేలా ఆరాధ్యను ఐశ్వర్య గ్రౌండెడ్‌గా పెంచారు. ఈ డిజిటల్ యుగంలో సాధారణ కుటుంబాలు కూడా భోజన సమయాల్లో హోంవర్క్ వేళల్లో.. పడుకునే ముందు స్క్రీన్ రహిత వాతావరణాన్ని అలవాటు చేయడం ద్వారా పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించవచ్చు.

మూడవ పాఠం.. సాంకేతికతకు బాధ్యతలను అప్పగించకుండా ప్రైమరీ కేర్ టేకర్‌గా మారడం. నేటి బిజీ లైఫ్‌లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఆడించడానికి లేదా బుజ్జగించడానికి మొబైల్ స్క్రీన్లను ఒక ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. కానీ ఐశ్వర్యరాయ్ ఒక అగ్ర నటి అయినా.. ఆరాధ్య రోజువారీ ఎదుగుదలలో తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ఇంట్లోని నియమ నిబంధనలు స్థిరంగా ఉండేలా చూసుకున్నారు. ఒక అంకితభావం గల పెద్దల పర్యవేక్షణలో పెరిగే పిల్లలలో మానసిక స్థిరత్వం.. నమ్మకం ఎక్కువగా ఉంటాయని.. అలా కాకుండా టెక్నాల‌జీకి అల‌వాటు ప‌డిన‌..సోషల్ మీడియా లైక్స్ కి అడిక్ట్ అయిన‌ పిల్లల వ్యక్తిత్వాన్ని శాసించకుండా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యం ఎంతో అవసరమని ఈ విధానం చెబుతోంది.

నాల్గవ పాఠం.. ప్రైవ‌సీ అనేది భద్రత.. రహస్యం కాదు. పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వయసు రాకముందే .. వారి అనుమతి లేకుండానే నేడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రతి చిన్న విషయాన్ని `డిజిటల్ కంటెంట్`గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆరాధ్య చుట్టూ ఉన్న ఫేక్ ఖాతాలను ఖండిస్తూ ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం.. పిల్లల వ్యక్తిగత గుర్తింపు చుట్టూ ఒక రక్షణ గోడను నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని గుర్తుచేస్తోంది. పిల్లల జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆన్‌లైన్‌లో ప్రదర్శించాల్సిన అవసరం లేదని.. ఇంటర్నెట్ వారిపై హక్కు సాధించకముందే వారిని నిజ జీవితంలో దృఢంగా ఉంచడమే ఐశ్వర్యరాయ్ పేరెంటింగ్ ఫిలాసఫీ అసలు అంతరార్థం అని ప్ర‌తి పేరెంట్ తెలుసుకోవాలి.