Begin typing your search above and press return to search.

స్త్రీల సంస్కృతి బట్టల్లోనే ఉంటుందా? యువ‌న‌టి ఎదురుదాడి!

ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళం స‌హా సౌత్ ఇండ‌స్ట్రీలో పాపుల‌రైన ఈ బ్యూటీ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో హెడ్ లైన్స్ లోకొస్తోంది.

By:  Sivaji Kontham   |   14 Sept 2026 3:00 PM IST
స్త్రీల సంస్కృతి బట్టల్లోనే ఉంటుందా? యువ‌న‌టి ఎదురుదాడి!
X

ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళం స‌హా సౌత్ ఇండ‌స్ట్రీలో పాపుల‌రైన ఈ బ్యూటీ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇటీవ‌ల డైమండ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌లో తాను ధరించిన దుస్తులపై జరిగిన ట్రోలింగ్, ఆన్‌లైన్ విమర్శలతో మ‌రోసారి ఐశ్వర్య లక్ష్మి పేరు మార్మోగుతోంది. ఈ వివాదంపై తాజాగా ఈ బ్యూటీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ న‌టి మహిళల ఎంపికలను తప్పుపట్టే సమాజ తీరును, పత్రికల రాత‌లు, కెమెరామెన్ల ప్రవర్తనను తీవ్రంగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ఈవెంట్‌లో ఫోటోగ్రాఫర్లు తన ముఖంపై ఫోకస్ చేయకుండా.. విచిత్రమైన, అనుచిత కోణాల్లో ఫోటోలు తీశారని ఆరోపించారు. దీంతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని.. ఆ సమయంలో తన వ్యక్తిగత సరిహద్దులను ఉల్లంఘించినట్లు అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తన శరీర భాషలో కనిపించిన ఆ అసౌకర్యాన్ని చూసి నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని.. దుస్తులు అసౌకర్యంగా ఉన్నాయని కొందరూ.. మరికొందరు ఆమె ఎందుకు ఆ డ్రెస్ ఎంచుకున్నారంటూ విమర్శలు గుప్పించారని ర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఒక బలమైన ప్రశ్న సంధిస్తూ.. సంస్కృతి అనేది కేవలం మహిళల క్లీవెజ్‌లో లేదా వారి బట్టల పొడవులోనే ఉంటుందా? మన ప్రవర్తనలో.. మనుషులపై మనం వ్యవహరించే తీరులో కూడా సంస్కృతి ఉంటుంది కదా! అని నిలదీశారు.

తొలి 24 గంటలు ఈ ట్రోలింగ్‌ను తాను కేవలం నవ్వుతూ కొట్టిపారేసినా రోజులు గడిచేకొద్దీ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐశ్వర్య తెలిపారు. దేశంలో చర్చించాల్సిన ఎన్నో ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలు ఉండగా.. కేవలం మహిళల దుస్తుల గురించే పదే పదే చర్చించడం ఎందుకని వ‌ర్ధ‌మాన న‌టి అసహనం వ్యక్తం చేశారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే న‌వీన్ చంద్ర స‌ర‌స‌న అమ్ము అనే చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ `సంబ‌రాల ఏటిగట్టు` అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది.

అగ్ర న‌టీమ‌ణుల వాద‌న‌:

సెలబ్రిటీల దుస్తులు, గ్లామర్ ఎక్స్‌పోజింగ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నది కేవలం ఐశ్వర్య లక్ష్మి మాత్రమే కాదు. గతంలోనూ పలువురు ప్రముఖ నటీమణులు తమ దుస్తుల ఎంపికపై వస్తున్న విమర్శలను.. నెటిజన్ల అనైతిక నైతిక పోలీసుగిరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల ఒక జ్యువెల్లరీ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. దీనిపై స్పందించిన ఈ బ్యూటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మహిళల దుస్తుల పొడవులోనో నెక్ లైన్ లోనో ఉండవని.. అవి వారి హృదయంలో ఉంటాయని ధైర్యంగా బదులిచ్చారు. మహిళల గౌరవాన్ని కేవలం వారి బట్టలతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు.

మరోవైపు గ్లామర్ పాత్రలు- దుస్తుల ఎంపికపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవారికి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, సమంత వంటి అగ్ర నాయికలు గతంలో గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. తమ శరీరం తమ ఇష్టమని.. ఏ దుస్తులు వేసుకోవాలనేది పూర్తిగా తమ వ్యక్తిగత స్వేచ్ఛ అని వారు స్పష్టం చేశారు. మహిళల వస్త్రధారణను తప్పుపట్టే వారు వారి నటనను వృత్తిపరమైన ప్రతిభను గుర్తించకుండా కేవలం రూపురేఖల మీదే దృష్టి పెట్టడాన్ని ఈ నటీమణులు ఎత్తిచూపారు. పబ్లిక్ ఫిగర్లుగా ఉన్నంత మాత్రాన తమ వ్యక్తిగత సరిహద్దులను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదని.. సమాజంలో ఈ మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పలు సందర్భాల్లో గళం విప్పారు.