Begin typing your search above and press return to search.

కోర్టుకు ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత అభిషేక్ కూడా..!

ఐశ్వర్య రాయ్ వ్యక్తిత్వ హక్కులపై హైకోర్టుకు వెళ్లినట్లు క‌థ‌నాలొచ్చిన మ‌రుస‌టిరోజే త‌న‌ భర్త అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా కోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

By:  Sivaji Kontham   |   10 Sept 2025 9:21 PM IST
కోర్టుకు ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత అభిషేక్ కూడా..!
X

లైంగిక అస‌భ్య‌క‌ర కంటెంట్ కోసం సెల‌బ్రిటీల‌ ఫోటోలు లేదా వీడియోల‌ దుర్వినియోగం, ఫేక్ ఫోటోలు, వీడియోల వినియోగం, వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డే మార్ఫింగ్ దుర్మార్గం, అనుమ‌తి లేకుండా ఫోటోలు, వీడియోల‌ను సంస్థ‌లు లేదా మీడియాలు స్వీయ ప్ర‌చార స్టంట్ కోసం దుర్వినియోగం చేయ‌డం వంటివి నేరం. న‌కిలీ ఫోటోలు లేదా వీడియోల‌తో ఇమేజ్ కి డ్యామేజ్ చేయ‌డం కూడా నేరం. ఇలాంటి ప‌రిస్థితుల నుంచి త‌మ‌ను కాపాడాల‌ని మొర‌పెట్టుకున్నారు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్. త‌న ఫోటోలు, వీడియోల‌ను అశ్లీలంగా దుర్వినియోగం చేసే సంస్థ‌లు లేదా వ్య‌క్తుల‌పై ఐష్‌ కోర్టును ఆశ్ర‌యించారు. ఐశ్వర్య రాయ్ వ్యక్తిత్వ హక్కులపై హైకోర్టుకు వెళ్లినట్లు క‌థ‌నాలొచ్చిన మ‌రుస‌టిరోజే త‌న‌ భర్త అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా కోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

తన గురించి త‌ప్పుడు ప్ర‌చారం సాగుతోంద‌ని, త‌న‌ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ అభిషేక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్య‌మాల‌లో తన ఫోటోలతో వ్యక్తిత్వానికి డ్యామేజ్ చేస్తూ, లైంగిక అసభ్యకరమైన విషయాలు సహా ఏదైనా నకిలీ వీడియోలను ఉపయోగించకుండా నిషేధించాలని కోరారు.

ఈ వ్య‌వ‌హారంలో కోర్టు విచారణ సందర్భంగా, అభిషేక్ కి చెందిన చాలా ఫేక్ ఫోటోలు, ఫేక్ సంతకాలతో అనధికార కంటెంట్ వెబ్ లో చెలామణి అవుతోంద‌ని.. దీని కార‌ణంగా అత‌డి ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అతని ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నార‌ని బచ్చన్ న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదించారు. అనుమతి లేకుండా బచ్చన్ సహా బాలీవుడ్ ప్రముఖుల ఫోటోల‌తో టీ-షర్టులు, ఇతర వస్తువులను అమ్మినందుకు వెబ్‌సైట్‌లపై చర్య తీసుకోవాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో ఢిల్లీ హైకోర్టులో ఐశ్వ‌ర్యారాయ్ పిటిష‌న్ లో ఆరోప‌ణ‌లు ఇలా ఉన్నాయి. కొన్ని కంపెనీల ఉత్పత్తులపై తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనధికారికంగా ఉపయోగించడంపై ఐష్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ వాణిజ్య దోపిడీ, మోసపూరిత ప్రాతినిధ్యాలు, ఆన్‌లైన్‌లో అశ్లీల, మ‌ర్ఫింగ్ ఫోటోల దుర్వినియోగానికి సంబంధించినది. దీనిని 15 జనవరి 2026న ఈ కేసును త‌దుప‌రి విచారిస్తారు. ఐశ్వ‌ర్యారాయ్ తరపున హాజరైన న్యాయవాది ప్ర‌కారం...మగ్గులు, టీ-షర్టులు, పానీయాలు సహా కొన్ని వ‌స్తువుల‌పై ఐశ్వ‌ర్యారాయ్ పేరు, ఫోటోల‌ను త‌ప్పుగా ఉప‌యోగించార‌ని కూడా ఆరోపించారు. కొన్ని త‌ప్పుడు వెబ్ సైట్ల త‌ప్పుడు ప్రచారాన్ని ఈ పిటిష‌న్ లో హైలైట్ చేసారు. ఒక పాపుల‌ర్ వెల్త్ కంపెనీ ఐశ్వర్యరాయ్ పేరును అధికారిక పత్రాలలో కంపెనీ చైర్‌పర్సన్‌గా వేసి దుర్వినియోగం చేసార‌ని అన్నారు. ఆ సంస్థతో ఐష్ కి ఎలాంటి సంబంధం లేదని ఇది పెద్ద మోసం అని పిటిష‌న్ లో పేర్కొన్నారు.

గతంలో ఐష్ మామ గారు అమితాబ్ బచ్చన్ సైతం తన పేరు, ఇమేజ్, వాయిస్, ఇతర వ్యక్తిగత అంశాలను కాపాడుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. కోర్టుల ప‌రిధిలో అమితాబ్ కు న్యాయం జ‌రిగాక ఇప్పుడు కొడుకు కోడ‌లు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది.