Begin typing your search above and press return to search.

మూవీపై ఏఐ ప్రభావం.. లోకేష్ కనగరాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

సినిమా అంటే టెక్నాలజీ.. పెరిగిన, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా మారుతూ వచ్చింది

By:  Ramesh Palla   |   3 Sept 2025 12:00 AM IST
మూవీపై ఏఐ ప్రభావం.. లోకేష్ కనగరాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌
X

సినిమా అంటే టెక్నాలజీ.. పెరిగిన, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా మారుతూ వచ్చింది. ఒకప్పుడు మాటలు లేకుండా వచ్చిన సినిమా ఆ తర్వాత మాటలతో వచ్చింది, మొదట్లో బ్లాక్ అండ్‌ వైట్‌లో మాత్రమే వచ్చిన సినిమా కలర్‌లో వచ్చింది. ఇప్పుడు సినిమాలకు వీఎఫ్‌ఎక్స్‌ ప్రధాన ఆకర్షణగా ఉంటున్నాయి. వీఎఫ్‌ఎక్స్ లేని సినిమాను అసలు ఊహించలేము. ఒకప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ లేకుండా సినిమాలు ఎలా చేశార్రా బాబు అనుకునే పరిస్థితి ఉంది. చిన్న విషయానికి కూడా వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్ ఇలా సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. సినిమా షూటింగ్‌ మొదలు కాక ముందు నుంచే సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్న రోజులు ఇవి. ఈ టెక్నాలజీ మరింతగా పెరిగితే ఎలా ఉంటుందా అనుకుంటున్న సమయంలో వచ్చిందే ఏఐ.

సినిమా ఇండస్ట్రీలో ఏఐ

అన్ని భాషల ఇండస్ట్రీలోనూ ఏఐ అనేది కీలక పాత్ర పోషించడం ఖాయం. ఇప్పటికే ఏఐ ని ఉపయోగించి స్క్రిప్ట్‌ను రెడీ చేయడం, లొకేషన్స్‌ ను డిజైన్‌ చేయడం ఇంకా చాలా పనులు చేస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు పాత్రలను కూడా క్రియేట్‌ చేస్తున్నారు. మన చుట్టూ లేని వారు, మన పక్కన లేని వారిని, అసలు చనిపోయిన వారిని కూడా సినిమాల్లో తీసుకు వచ్చేందుకు ఏఐ వినియోగపడుతుంది. ప్రస్తుతం ఏఐ ను సినిమాల్లో మరింతగా ఎలా వినియోగించాలి, అది ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకు ఎలా పని చేస్తుంది అనే విషయాలపై అధ్యయనం సాగుతోంది. తాజాగా కూలీ సినిమాలో రజనీకాంత్‌ ను 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లడం మొదలుకుని, పలు విషయాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏఐ ని వినియోగించిన విషయం తెల్సిందే.

లోకేష్ కనగరాజ్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏఐ గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం ఏఐ అనేది ప్రారంభ దశలో ఉంది. సినిమా ఇండస్ట్రీలో ప్రారంభ దశలోనే ఇలాగ ఉంటే ఖచ్చితంగా రాబోయే తరాలు అద్భుతాలను ఏఐ ద్వారా చూడబోతున్నారు. ఏఐ ద్వారా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్న అద్భుతాలను ఇప్పుడే ఊహించడం కష్టం అని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏఐ తో సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఎక్కువ పని ఉంటుందని ఆయన అన్నాడు. ఒకప్పుడు ఓటీటీలు సినిమా ఇండస్ట్రీలో ఉండలేవు, అసలు సినిమాలకు ఓటీటీలకు సెట్‌ కావు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓటీటీల కోసం సినిమాలు తీసే పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఓటీటీల వల్ల సినిమాల స్థాయి పెరిగిందని లోకేష్ అన్నాడు.

రాబోయే రోజుల్లో సినిమాలపై ఏఐ ప్రభావం

సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే ఓటీటీలు ఉప్పెన మాదిరిగా వచ్చాయో అలాగే ఏఐ కూడా ఓ రేంజ్‌ లో రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నాడు. ఏఐ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలని అందరితో పాటు తాను ఎదురు చూస్తున్నట్లు దర్శకుడు అన్నాడు. చనిపోయిన స్టార్స్‌ను తీసుకు వచ్చి బతికి ఉన్న స్టార్స్ పక్కన నటింపజేసి మల్టీ స్టారర్ మూవీలను తీసుకు రావడం వల్ల ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. కృష్ణ యంగ్‌ ఏజ్‌, మహేష్‌ బాబు ప్రస్తుత ఏజ్‌ గ్రూప్‌ లో ఒక సినిమాను తీయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఏఐ వస్తే ఇలాంటివి చాలా ఈజీగా చేసేయవచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.