Begin typing your search above and press return to search.

'AI యాక్ట‌ర్లు' త‌మ‌ను రీప్లేస్ చేసేస్తే? తీవ్ర భ‌యాందోళ‌న‌లో టాప్-10 స్టార్లు!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండటం సినిమా రంగంలో తీవ్ర ఆందోళనకు తెర‌తీస్తోంది.

By:  Sivaji Kontham   |   25 Sept 2026 3:00 PM IST
AI యాక్ట‌ర్లు త‌మ‌ను రీప్లేస్ చేసేస్తే? తీవ్ర భ‌యాందోళ‌న‌లో టాప్-10 స్టార్లు!
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండటం సినిమా రంగంలో తీవ్ర ఆందోళనకు తెర‌తీస్తోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత తమ ఉనికిని, అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందని.. డిజిటల్ క్లోన్‌లు తెరను ఏలే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హెచ్చరిస్తున్నారు. కేవలం వినోదం పంచడమే కాకుండా.. నటుల హక్కులు.. ఉపాధికి ఇది ముప్పుగా పరిణమిస్తోందనేది పెద్ద ఆందోళ‌న‌.

హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. టామ్ క్రూజ్, కీను రీవ్స్, స్కార్లెట్ జాన్సన్, సూసన్ సరండన్, టామ్ హాంక్స్, జస్టిన్ బాల్డోని, ఫ్రాన్ డ్రెషర్, జస్టిన్ లాంగ్, జాన్ కుసాక్ , మరియోన్ కొటిల్లార్డ్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు AI ప్రభావంపై తమ భయాలను వ్యక్తం చేశారు. డిజిటల్ డబుల్స్ వల్ల నిజమైన మానవ సాహసాలకు, అసలైన భావోద్వేగాలకు విలువ తగ్గిపోతుందని ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రియోన్ కొటిల్లార్డ్ వంటి ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టులు భవిష్యత్తులో ఈ సాంకేతికత ప్రేక్షకులను మోసగించే స్థాయికి వెళుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఇదే తరహాలో భారతీయ సినీ పరిశ్రమలోనూ.. ముఖ్యంగా బాలీవుడ్ -టాలీవుడ్ లోను ప్ర‌ముఖుల‌లో AI -డీప్‌ఫేక్ సవాళ్లు ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మేన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, మ‌హేష్, రానా దగ్గుబాటి, ఆలియా భట్, రష్మిక మందన్న, శృతిహాసన్ వంటి ప్రముఖులు నటుల గుర్తింపు, ప్రైవసీ, భవిష్యత్తు ఉపాధిపై ముప్పు పొంచి ఉందని గళం విప్పారు. కొందరి గొంతులు, రూపాలు, మేనరిజాలను అనధికారిక ప్రకటనల‌లో దుర్వినియోగం చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు ఇప్పటికే ముందు జాగ్రత్తగా `పర్సనాలిటీ రైట్స్` (వ్యక్తిత్వ హక్కులు) పొందడానికి ముందుకు రావడానికి ప్రధాన కారణం ఇదే. తమ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో.. ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో లేదా సినిమాల్లో తమ ముఖాలు, ఫోటోలు లేదా వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుతుండటం వల్ల కలిగే ముప్పును వారు ముందే గ్రహించారు. అభిమానుల సృజనాత్మకత వేరైనా.. వాణిజ్యపరమైన దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి చట్టపరమైన రక్షణ అవసరమైంది.

ఈ నేపథ్యంలో భారతీయ నటులు తమ రూపం, గొంతు, హావభావాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఢిల్లీ -బాంబే హైకోర్టుల ద్వారా ప్రత్యేక చట్టపరమైన రక్షణలను ఆశ్రయిస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంఘాలు, గిల్డ్‌లు AI టెక్నాలజీ నియంత్రణ కోసం కఠినమైన నిబంధనలను డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సినిమా మేకింగ్‌లో ఒక కొత్త మార్పును తెచ్చినా కానీ.. అది హ్యూమ‌న్ పెర్ఫామ‌ర్స్ (న‌టీనటుల) ఉనికికి, హక్కులకు పెను సవాల్‌గా మారుతోంది. భవిష్యత్తులో టెక్నాలజీ ఎటువైపు దారితీస్తుందనే ఉత్కంఠతో పాటు.. నటీనటుల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆందోళ‌న ఉధృత‌మ‌వుతోంది.