Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ల‌కు మార్ఫింగ్ బెడ‌ద‌.. ఆటోబ్లాక్ చేయ‌డానికి AI ప‌రిష్కారం?

సాంకేతికత సృష్టించిన ఈ శాపానికి కేవలం చట్టాల వల్లే కాకుండా.. సమాజంలో కూడా మార్పు వచ్చినప్పుడే పూర్తి పరిష్కారం లభిస్తుంది.

By:  Sivaji Kontham   |   14 July 2026 10:11 PM IST
హీరోయిన్‌ల‌కు మార్ఫింగ్ బెడ‌ద‌.. ఆటోబ్లాక్ చేయ‌డానికి AI ప‌రిష్కారం?
X

డిజిటల్ విప్లవం ముసుగులో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ క్రైమ్ కేసులు భారీగా నమోదవుతున్నా.. సెలబ్రిటీలను వేధిస్తున్న మార్ఫింగ్ ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోల బెడద మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కథానాయికల ఫోటోలను అసభ్యకరంగా మార్చేస్తూ.. వారి వ్యక్తిగత ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు దుండగులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ అరాచకత్వానికి శాశ్వత పరిష్కారం లేదా? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం 2026లో కూడా ఈ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల బారిన పడి తీవ్రమైన మానసిక వేదనకు, కలతకు గురైన కథానాయికల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల మలయాళ నటి అన్నా రాజన్ (అంగమాలి డైరీస్ ఫేమ్) తన మార్ఫింగ్ ఫోటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కేరళ పోలీసులను, సైబర్ డోమ్ అధికారులను ఆశ్రయించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు, అసభ్యకరంగా - మానహాని కలిగించేలా తన ఫోటోను ఎడిట్ చేశారని... దీనికి కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే వరకు తాను వదిలిపెట్టనని హెచ్చరించారు. గతంలో ఒక పండుగ సందర్భంగా తీసిన ఫోటోలపై అనవసర వివాదం రేగడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిన అన్నా రాజన్.. ఇప్పుడు ఏకంగా సైబర్ నేరగాళ్ల మార్ఫింగ్ దారుణానికి బలవడం త‌న మ‌నసును తీవ్రంగా గాయపరిచింది.

సైబ‌ర్ వేధింపుల కార‌ణంగానే...ఇటీవ‌ల క‌థానాయిక‌లు, న‌టీన‌టులు కోర్టుల్ని ఆశ్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. తమ అనుమతి లేకుండా తమ పేరు, వాయిస్, ముఖ రూపం (ఫేస్), లేదా వ్యక్తిగత వివరాలను ఏఐ లేదా ఇతర సాంకేతికతలతో మార్ఫింగ్ చేయకుండా ఉండేందుకు పలువురు కథానాయికలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ `పర్సనాలిటీ రైట్స్` లేదా సెలబ్రిటీ హక్కులను కోరుతున్నారు. తమ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకు కోర్టుల ద్వారా ముందస్తు రక్షణ ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. అయినా డార్క్ వెబ్, అనామక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ కంటెంట్ వైరల్ అవుతూనే ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. నటి అన్నా రాజన్ ర‌జ‌నీ `జైలర్ 2`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అసలు ఈ మార్ఫింగ్ బెడదకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడానికి ప్రధాన కారణం చట్టాల్లో ఉన్న లొసుగులు - సోషల్ మీడియా వేదికల అలసత్వమే. ఒక అకౌంట్ నుండి మార్ఫింగ్ ఫోటో డిలీట్ చేసేలోపే... అది వందల కొద్దీ ఇతర అకౌంట్లలోకి రీపోస్ట్ అవుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసి నిందితులను పట్టుకునే ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల నేరగాళ్లకు భయం లేకుండా పోతోంది. కేవలం బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా... ఏఐ సాంకేతికతతో ఆటోమేటిక్‌గా మార్ఫింగ్ ఫేషియల్ కంటెంట్‌ను గుర్తించి బ్లాక్ చేసే కఠినమైన వ్యవస్థను సోషల్ మీడియా సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సాంకేతికత సృష్టించిన ఈ శాపానికి కేవలం చట్టాల వల్లే కాకుండా.. సమాజంలో కూడా మార్పు వచ్చినప్పుడే పూర్తి పరిష్కారం లభిస్తుంది. నటీమణులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఇలాంటి అబ్యూసివ్ - అసభ్యకరమైన కంటెంట్‌ను షేర్ చేయవద్దని... సపోర్ట్ చేయవద్దని ప్రేక్షకులను వేడుకుంటున్నారు. చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయడంతో పాటు... డిజిటల్ మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగించడంపై యూజర్లలో అవగాహన పెరిగినప్పుడే ఈ మార్ఫింగ్ భూతానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

టెక్నాల‌జీతో ఏదైనా సాధ్య‌మే కానీ..!

సాధారణంగా ఒక కథానాయిక మార్ఫింగ్ ఫోటో కానీ.. అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియో కానీ నెట్‌లో ప్రత్యక్షమైనప్పుడు.. బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ లింకులను తొలగించే లోపే అవి దావానలంలా ఇంటర్నెట్ అంతటా వ్యాపించిపోతున్నాయి. దీనికి విరుగుడుగా `AI ఆటో-బ్లాకింగ్ సిస్టమ్` ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్) తమ అల్గారిథమ్స్‌లో అధునాతన ఏఐ టూల్స్‌ను అనుసంధానించాలి. ఇవి ఒక ఫోటో అప్‌లోడ్ అవుతున్నప్పుడే.. అందులోని ముఖ కదలికలు.. స్కిన్ టోన్ వేరియేషన్స్.. ఒరిజినల్ ఫోటోల డేటాను క్షణాల్లో స్కాన్ చేసి, అది మార్ఫింగ్ కంటెంట్ అని గుర్తిస్తే సర్వర్‌లలోకి అప్‌లోడ్ కాకుండానే `ఆటో-బ్లాక్` చేయగలవు. అయితే ఈ ఏఐ ఆటో-బ్లాకింగ్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కొన్ని సాంకేతిక, ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయని కూడా తెలుస్తోంది.