Begin typing your search above and press return to search.

యానిమేష‌న్ - AI సినిమాలు ఇవేనా టాలీవుడ్ భ‌విష్య‌త్?

నిజానికి అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో ఎక్కువ లాభాలు తెచ్చే సినిమాల‌నే సిస‌లైన బాక్సాఫీస్ విజేత‌లుగా నిర్థారిస్తోంది ట్రేడ్.

By:  Sivaji Kontham   |   22 Aug 2025 4:00 AM IST
యానిమేష‌న్ - AI సినిమాలు ఇవేనా టాలీవుడ్ భ‌విష్య‌త్?
X

యానిమేష‌న్ సినిమాలు- ఏఐ సినిమాలు ఇవే ఇక టాలీవుడ్ భ‌విష్య‌త్? అవునా .. నిజ‌మేనా! ఇదే భ‌విష్య‌త్ అయితే ఈ స్పేస్‌లో మ‌న టాలీవుడ్ ఈ ద‌శ‌లో ఎక్క‌డ ఉంది? తెలుగు చిత్ర‌సీమ‌లో బ‌డా నిర్మాత‌లు అంద‌రూ అగ్ర హీరోలు-అగ్ర ద‌ర్శ‌కుల‌తో కాంబినేష‌న్లు సెట్ చేసి సినిమాలు చేసేందుకే ఇంకా మొగ్గు చూప‌డం దేనికి? యానిమేష‌న్, ఏఐతో సినిమాలు చేసి బాక్సాఫీస్ హిట్లు కొట్టే అవ‌కాశం మ‌న ద‌ర్శ‌కుల‌కు ఎందుకు క‌ల్పించ‌కూడ‌దు?

నిజానికి అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో ఎక్కువ లాభాలు తెచ్చే సినిమాల‌నే సిస‌లైన బాక్సాఫీస్ విజేత‌లుగా నిర్థారిస్తోంది ట్రేడ్. పెద్ద హీరో- పెద్ద ద‌ర్శ‌కుడి పేరుతో బ‌డ్జెట్లో మెజారిటీ భాగం, అంటే వంద‌ల కోట్లు త‌గుల‌బెట్టే సంస్కృతికి ఇది భిన్న‌మైన సంస్కృతి. కేవ‌లం యానిమేష‌న్ బొమ్మ‌లు లేదా కృత్రిమ మేథ‌స్సు ద్వారా క్రియేట్ చేసే ఇమేజెస్- విజువ‌ల్స్ తో సినిమాని న‌డిపించ‌డం అనేది ఇప్పుడు చాలా ఆలోచింప‌జేస్తున్న అంశం. అస‌లు ఏఐలో ఏదైనా విజువ‌ల్ చూసిన‌ప్పుడు ఇది కృత్రిమ మేథ‌స్సుతో చేసిన‌దేనా? లేక ఒరిజిన‌లా? అనే సందేహం క‌చ్ఛితంగా ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది అంటే.. ఏఐలో విజువ‌ల్స్ ని క్రియేట్ చేయ‌డంలో మ‌న సాంకేతిక నిపుణులు ఎంత అడ్వాన్స్ డ్ గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే ఇప్పుడు టాలీవుడ్ నుంచి క‌నీసం డ‌జ‌ను మంది ద‌ర్శ‌కులు యానిమేష‌న్ లో సినిమాలు తీసేందుకు అవ‌స‌ర‌మైన క‌థ‌ల్ని వెత‌కాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అలాగే ఏఐలోను సినిమాలు తీసేందుకు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌త్యేకించి విదేశాల‌కు వెళ్లి మ‌రీ ఏఐని నేర్చుకుని వ‌చ్చారు. ఈ విష‌యంలో అత‌డు ఇత‌రుల కంటే చాలా అడ్వాన్స్ డ్ గా ఆలోచించార‌ని అంగీక‌రించాలి. ఇక తెలుగు ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది దిగ్ధ‌ర్శ‌కులు ఏఐలో సినిమాల‌ను రూపొందించ‌గ‌ల‌రు. కానీ దాని కోసం వీరంతా ఇంకా ఎదురు చూస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టి ట్రెండ్ లో ఆలోచించి అడ్వాన్స్ డ్ గా ప్ర‌యోగాల‌కు దిగేందుకు ఆస్కారం ఉన్నా... హీరో సామ్య ప‌రిశ్ర‌మ‌లో ఇంకా యానిమేష‌న్ లేదా ఏఐ సాంకేతిక‌త వినియోగం గురించి వెన‌క‌బాటు ఆలోచ‌న‌లతోనే ఇంకా ఉన్నారా? అన్న‌ది ఇప్ప‌టికి అర్థం కానిది.

ఇప్ప‌టికిప్పుడు కేవ‌లం యానిమేష‌న్ క‌థలు లేదా ఏఐతో మ్యాజిక్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కులు ఎవ‌రున్నారు? అన్న‌ది ప‌రిశీలిస్తే... ఈగ- బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాల‌తో రాజ‌మౌళి ఎప్పుడూ టాప్ స్లాట్ లో ఉన్నారు. ద‌ర్శ‌కధీరుడు సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంలో ఎప్పుడూ అగ్ర‌స్థానంలో ఉన్నారు. యానిమేష‌న్, ఏఐలో ఆయ‌న అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌ర‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. పుష్ప‌- పుష్ప 2 లాంటి మాస్ సినిమాల్లో సుకుమార్ అద్భుత‌మైన వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్‌ని ఉప‌యోగించుకున్నారు. యానిమేష‌న్ తో ప‌ని చేయ‌గ‌లిగే స‌మ‌ర్థ‌త సుక్కూకి పుష్క‌లంగా ఉంది. ఇక కార్తికేయ‌, కార్తికేయ 2, తండేల్ చిత్రాల‌తో చందు మొండేటి సాంకేతికంగా అద్భుత విజువ‌ల్స్ ని క్రియేట్ చేయ‌గ‌ల‌ర‌ని నిరూప‌ణ అయింది. అందువ‌ల్ల చందు మునుముందు యానిమేష‌న్ క‌థ‌ల‌తో లేదా కృత్రిమ మేథ‌స్సుతో పూర్తి నిడివి సినిమాలు తీసేందుకు ప్ర‌య‌త్నించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

హ‌నుమాన్, జై హ‌నుమాన్ సినిమాల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ పీక్ లో ఉన్నాడు. అత‌డు హ‌నుమాన్ కోసం ప‌రిమిత బ‌డ్జెట్ లో అత్యుత్త‌మ యానిమేష‌న్ - వీఎఫ్ఎక్స్ విజువ‌ల్స్ ని రాబ‌ట్టాడు. సాంకేతికంగా అత‌డు ఎప్పుడూ ది బెస్ట్ అని నిరూపించాడు. అందివ‌చ్చిన టెక్నాల‌జీని స‌ద్వినియోగం చేయ‌డంలో నోలాన్ అంత‌టోడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇక రాజా సాబ్ తో మారుతి అలాంటి ఒక మ్యాజిక్ చేయ‌బోతున్నాడు. హార‌ర్ జాన‌ర్ లో వ‌స్తున్న ఈ సినిమాలో వీ.ఎఫ్.ఎక్స్ గ్లింప్స్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని తెలుస్తోంది. నిజానికి ద‌ర్శ‌కుడు మారుతి సినిమాల్లోకి రాక మునుపు యానిమేష‌న్ గురువు కూడా. బ‌న్నీకి యానిమేష‌న్ నేర్పించాడు. అత‌డికి సాంకేతికంగా మంచి పట్టుంది. అందువ‌ల్ల మ‌హావ‌తార్ లాంటి యానిమేష‌న్ సినిమా చేయ‌గ‌ల‌డు. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర లాంటి భారీ సోషియో ఫాంట‌సీ సినిమా తీస్తున్న‌ దర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ఠ భ‌విష్య‌త్ లో యానిమేష‌న్, ఏఐతో సినిమాలు తీసి నిరూపించ‌గ‌ల‌ర‌ని అభిమానులు భావిస్తున్నారు.

మ‌హావ‌తార్ న‌ర‌సింహా బెస్ట్ ఎగ్జాంపుల్:

ఇటీవ‌లే విడుద‌లైన‌ యానిమేటెడ్ ఎపిక్ యాక్షన్ డ్రామా `మహావతార్ నరసింహా` బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 30రోజులు పైగా అద్భుత వ‌సూళ్ల‌తో దూసుకుపోయింది. భారతదేశంలో 216.02 కోట్ల నిక‌ర వ‌సూళ్ల‌ను సాధించింది. విదేశీ వ‌సూళ్లు క‌లుపుకుని మొత్తం 277 కోట్లు ఆర్జించింది. ఐదో వారంలోను ఈ సినిమా స్ట‌డీగా కొన‌సాగుతోంది. మ‌హావ‌తార్ ఏరియా వారీగా వసూళ్ల‌ను చూస్తే, హిందీ: 163.52 కోట్లు, తెలుగు: 42.35 కోట్లు, కన్నడ: 7.11 కోట్లు, తమిళం: 2.51 కోట్లు, మలయాళం: 53 లక్షలు వ‌సూలు చేసింది. మొత్తం: 216.02 కోట్లు దేశీయంగా వ‌సూలైంది. మహావతార్ నర్సింహ బాలీవుడ్‌లో అత్యంత‌ లాభదాయక చిత్రంగా నిలిచింది.

కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ యానిమేటెడ్ డ్రామా 201.02 కోట్ల రాబడిని ఆర్జించింది. లాభాన్ని శాతంగా మార్చి చూస్తే 1340శాతం ఆర్జించింది. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌లో `సు ఫ్రమ్ సో` తర్వాత 2025లో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా మహావతార్ నర్సింహా రికార్డుల‌కెక్కింది. బాలీవుడ్‌లో ఆల్ టైమ్ లో అత్యధికంగా వసూలు చేసిన టాప్ 5 చిత్రాలను ప‌రిశీలిస్తే, మహావతార్ నరసింహ: 1340 శాతం, ది కాశ్మీర్ ఫైల్స్: 1162 శాతం, స్ట్రీ 2: 946 శాతం, యూరి - ది సర్జికల్ స్ట్రైక్: 876 శాతం, ది కేరళ స్టోరీ: 694 శాతం లాభాలు అందించాయి. ఒక యానిమేటెడ్ సినిమా పెద్ద స్టార్ల సినిమాల‌ను మించి లాభాలార్జించింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ కూడా ఈ విభాగంపై దృష్టి సారించాల్సి ఉంది.