94 ఏళ్ల దిగ్గజ దర్శకుడితో అహల్య ప్రయాణం!
ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్‌ను ఆయన స్వయంగా పర్యవేక్షించారని.. రచయితల గది నుండి షూటింగ్ సెట్ వరకు ఆయన ప్రభావం స్పష్టంగా కని పించిందన్నారు.
By: Srikanth Kontham | 7 Aug 2026 1:02 PM ISTఅహల్య 2024లో రిలీజ్ అయిన `ఐ వాంట్ టు టాక్` చిత్రంతో గుర్తింపు పొందింది. అటుపై `సింగ్ గీతం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 25 ఏళ్ల వయసులోనే అహల్యకు అత్యంత వృద్ధుడైన క్రియాశీలక చిత్ర దర్శక, నిర్మాత 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం దక్కింది. ఈ అనుభవం గురించి అహల్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సింగీతం లాంటి దిగ్గజ దర్శకుడితో పని చేయడం పట్ల అహల్య ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. సింగీతం వయస్సు రీత్యా ప్రయాణ ఇబ్బందులు ఉన్నా సింగ్ గీతం చిత్రాన్ని రిమోట్ పద్ధతిలో దర్శకత్వం వహించారని అహల్య వివరించారు.
ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్‌ను ఆయన స్వయంగా పర్యవేక్షించారని.. రచయితల గది నుండి షూటింగ్ సెట్ వరకు ఆయన ప్రభావం స్పష్టంగా కని పించిందన్నారు. అలాగే దర్శకుడితో వయసు గ్యాప్ గురించి ప్రశ్నించగా సింగీతంతో పని చేస్తున్నప్పుడు ఎప్పుడూ తరాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనిపించలేదని అహల్య పేర్కొన్నారు. సింగీతం చాలా ఉత్సాహంగా, చమత్కారంగా ఉండేవారని షూటింగ్ సమయంలో పాత్రల గురించి ఆయన చెప్పే ఫన్నీ విషయాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవన్నారు. వారిద్దరి ఆలోచనలు ..సినిమా పట్ల ఉన్న అభిరుచి ఒకేలా ఉండటంతో పని చేయడం సులభమైందని వెల్లడించారు.
తెలుగు భాషలో అహల్య అరంగేట్రం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మడు తన భయాలను బయట పెట్టారు. తనకు రాని భాషలో నటించడం సవాలు గా ఉంటుందన్నారు. అందులోనూ తెలుగు సంస్కృతికి అద్దం పట్టే పాత్రకు న్యాయం చేయగలనా ?లేదా ? అని ఆందోళన చెందినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఈ పాత్రకు తాను సరిగ్గా సరిపోతానని చిత్రనిర్మాతలు నమ్మడం, దానికి తోడు తన వ్యక్తిగత జీవితానికి ..ఈ పాత్రకు మధ్య ఉన్న పోలికలు ధైర్యాన్ని అందించాయన్నారు.
సినిమా విడుదల తర్వాత వచ్చిన విమర్శలను కూడా సానుకూలంగా తీసుకున్నాన్నారు. భాషా ఉచ్చారణలో తన యాక్సెంట్ గురించి వచ్చిన కామెంట్లను అంగీకరించారు. ఏ భాషలో నైనా పరాయి అమ్మాయి పరిపూర్ణతను సాధించడం అసాధ్యమని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించడం, ముఖ్యంగా సమాజం , అత్యాశ గురించి సినిమా ఇచ్చిన సందేశం గురించి చర్చించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అహల్య తెలిపారు.
సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండరీ దర్శకుడి మార్గదర్శకత్వంలో కెరీర్ ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె ముగించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉండటంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతోంది. నటిగా కెరీర్‌ను విజయవంతంగా ప్రారంభించిన అహల్య తదుపరి `ముక్తి` అనే లైవ్-యాక్షన్ వీడియో గేమ్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
