Begin typing your search above and press return to search.

ఈ ఓవర్‌ నైట్‌ కుర్ర స్టార్‌ జర్నీ ఎటూ...?

బాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు దేశం మొత్తం హిందీ సినిమా 'సయ్యారా' గురించి చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   6 Aug 2025 4:00 PM IST
ఈ ఓవర్‌ నైట్‌ కుర్ర స్టార్‌ జర్నీ ఎటూ...?
X

బాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు దేశం మొత్తం హిందీ సినిమా 'సయ్యారా' గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాను కేవలం రూ.30 కోట్లతో రూపొందించారు. ఇప్పటి వరకు ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లను థియేట్రికల్‌ రిలీజ్ ద్వారా రాబట్టింది. ఓటీటీ ఇతర రైట్స్ ద్వారా సునాయాసంగా రూ.100 కోట్లు వస్తుందనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సయ్యారా సినిమా విజయం మొత్తం బాలీవుడ్‌ కి బూస్ట్‌ను ఇచ్చింది. చిన్న సినిమాలు ఆడటం లేదు, పెద్ద సినిమాలకు నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో అనూహ్యంగా సయ్యారా సినిమా ఒక దిశ చూపించినట్లు అయింది. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఖచ్చితంగా హిట్‌ చేసేందుకు జనాలు రెడీగా ఉన్నారు అని ఆ సినిమా మంచి సందేశం ఇచ్చినట్లు అయింది.

చుంకీ పాండే సోదరుడి కొడుకు అహాన్ పాండే

సయ్యారా సినిమాలో హీరోగా అహాన్ పాండే నటించగా హీరోయిన్‌గా అనీత్‌ పడ్డా నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే ఫ్యామిలీకి చెందిన వాడే అహాన్ పాండే. చుంకీ పాండే సోదరుడు చిక్కీ పాండే కుమారుడు అయిన అహాన్ పాండే సినిమా నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు పెద్దగా బ్రేక్‌ దక్కలేదు. బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్న అహాన్ పాండేకి సయ్యారా సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్డం దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ కి అప్‌ కమింగ్‌ సూపర్‌ స్టార్‌ అంటూ చాలా మంది ఆయన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కొందరు ఆయన్ను రణ్వీర్‌ సింగ్‌ అంటే కొందరు హృతిక్‌ రోషన్ అంటూ కీర్తిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌ మొత్తం దృష్టిని ఆహాన్ తన వైపుకు తిప్పుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు.

హృతిక్‌ రోషన్‌తో అహాన్ పాండేకి పోలిక

అహాన్ పాండేను చాలా మంది సూపర్‌ స్టార్స్‌తో పోల్చుతూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. సయ్యారా సినిమాలో అతడి నటన, డాన్స్ ఇతర విషయాల గురించి మాట్లాడుతూ చాలా మంది హృతిక్‌ రోషన్‌ పోలికలు ఇదుగో అంటున్నారు. మరికొందరు కార్తీక్ ఆర్యన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలతోనూ పోల్చుతున్నారు. ముందు ముందు అతడు ఎంపిక చేసుకోవాల్సిన సినిమాలు ఇలా ఉండాలని కొందరు, అలా ఉండాలని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌ కి ఒక జోష్‌ తీసుకు రావడంతో సయ్యారా సినిమా గురించి దేశం మొత్తం చర్చించుకుంటూ ఉంటే, అదే సమయంలో ఆ సినిమాలో హీరోగా నటించిన అహాన్ పాండే, హీరోయిన్‌గా నటించిన అనీత్‌ పడ్డాల గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది.

సయ్యారా బాక్సాఫీస్‌ జోరు కంటిన్యూ

మోహిత్‌ సూరి దర్శకత్వంలో రూపొందిన సయ్యారా సినిమా బాక్సాఫీస్‌ వద్ద సాధిస్తున్న వసూళ్లు చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. విడుదలైన మూడో వారంలోనూ సాధిస్తున్న వసూళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఇలాంటి కలెక్షన్స్ చూసి చాలా కాలం అయిందని, బాలీవుడ్ మొత్తం లెక్కలను, అంచనాలను మార్చేసింది అంటూ సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో అహాన్ పాండే నుంచి వచ్చే తదుపరి సినిమా సైతం అదే స్థాయిలో ఉండాలని అభిమానులతో పాటు అంతా కోరుకుంటున్నారు. ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ అయిన ఈ కుర్రాడు ముందు ముందు ఎలాంటి సినిమాలను ఎంపిక చేసుకుంటాడు అనేది చూడాలి.