'అజ్ఞాతవాసి' మోడ్ లో నాగవంశీ.. కారణమేంటంటే?
టాలీవుడ్ లో అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సినిమాలు.. మెల్లమెల్లగా ఇప్పటి జనరేషన్ కు ఎలా దగ్గరవుతాయో తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.
By: M Prashanth | 23 March 2026 5:52 PM ISTటాలీవుడ్ లో అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సినిమాలు.. మెల్లమెల్లగా ఇప్పటి జనరేషన్ కు ఎలా దగ్గరవుతాయో తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. ప్రముఖ నిర్మాత నాగవంశీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందుకు కారణం. అసలేం జరిగింది? నాగవంశీ ఏమన్నారు? వివరాల్లోకి వెళ్తే..
స్టార్ మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ రీసెంట్ గా నిర్వహించిన లైవ్ కన్సర్ట్ లో అజ్ఞాతవాసి చిత్రంలోని పాటలు అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకున్నాయి. సోషల్ మీడియాలో ఆ సాంగ్స్ కు సంబంధించిన వందలాది రీల్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గాలి వాలుగా.., బయటకు వచ్చి చూస్తే టైమేమో.. వంటి పాటలు కన్సర్ట్ లో యువతను ఉర్రూతలూగించాయి.
దీంతో రెస్పాండ్ అయిన నాగ వంశీ, అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ 2017లో ఆ సినిమా విడుదలైనప్పుడు ఇదే పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పారు. చాలా మంది కూడా అప్పట్లో ఈ పాటలపై అనుకున్నట్లుగా స్పందించలేదని, ఆ సమయంలో వచ్చిన రెస్పాన్స్ చూసి తాము నిజంగా ఆశ్చర్యపోయామని తెలిపారు నాగవంశీ.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నాగ వంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ యూత్ ఆ పాటలు ఎంతో ఇష్టంగా వినడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. మ్యూజిక్ అనేది కొన్నిసార్లు వెంటనే ప్రభావం చూపకపోయినా, మెల్లమెల్లగా తన వాల్యూ నిరూపించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అజ్ఞాతవాసి విడుదలైన సమయంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ వాటిని అందుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమా కథ, కథనం మీద విమర్శలు వచ్చాయి. అయితే సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన ఆల్బమ్ మాత్రం తర్వాత రోజుల్లో మెల్లగా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఆ సాంగ్స్.. కొత్త జనరేషన్ కు మరింత చేరువ కావడం విశేషంగా మారింది.
సోషల్ మీడియా యుగంలో అప్పటి సినిమాల పాటలు, సీన్లు తిరిగి ట్రెండ్ కావడం సాధారణమైంది. అదే తరహాలో అజ్ఞాతవాసి పాటలు కూడా ఇప్పుడు కొత్త ఊపుతో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నాగ వంశీ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు నిరాశ కలిగించిన సాంగ్స్, మెల్లగా ఎలా పాపులర్ అయ్యాయో ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అజ్ఞాతవాసి మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, దాని మ్యూజిక్ మాత్రం ఇప్పటికీ ప్రస్తుత జనరేషన్ కి దగ్గరవుతూ, జనరేషన్ కి తగ్గట్టు కొత్త గుర్తింపు కూడా సంపాదించుకుంటుంది. ఇది మ్యూజిక్ కు ఉన్న పెర్మనంట్ పవర్ ను మరోసారి రుజువు చేస్తోందని చెప్పాలి.
