ట్రైలర్ టాక్: ఎమోషనల్ 'వార్' డ్రామాలో డ్యాషింగ్ సైనికుడి కథ
`ఇక్కిస్` చిత్రంలో ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
By: Sivaji Kontham | 30 Oct 2025 9:52 AM ISTశత్రువులతో పోరాడుతూ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వీర సైనికుడిగా ఇచ్చే అత్యున్నత దేశ పురస్కారం- పరమవీరచక్ర. ఈ పురస్కారాన్ని అత్యంత పిన్న వయసులో అందుకున్న వీరుడిగా సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ చరిత్రకెక్కారు. ఇప్పుడు ఆయన జీవితం వెండితెరకెక్కుతోంది. బాంబే ప్రావిన్స్ లో జన్మించిన అతడు ఇండో- పాక్ బార్డర్ వార్ లో ట్యాంక్ కమాండర్ గా పది శత్రు ట్యాంకర్లను పేల్చివేసాడు. అతడు కేవలం 21 సంవత్సరాల వయసులో వారియర్ గా బ్యాటిల్ గ్రౌండ్ లో మృతి చెందాడు. అందుకే ఈ బయోపిక్ చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
`ఇక్కిస్` చిత్రంలో ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కథానాయకుడికి తాతగా వెటరన్ నటుడు ధర్మేంద్ర నటించాడు. అతడు సైనికుల విరోచిత పోరాటాల గురించి స్ఫూర్తివంతమైన కథలను చెబుతూ ట్రైలర్ లో ఆసక్తిని పెంచాడు. ఇక యుద్ధ ట్యాంకర్ నిపుణుడిగా బ్యాటిల్ గ్రౌండ్ లో పోరాడే యువ సైనికుడిగా అగస్త్య నందా నటనాభినయం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వార్ డ్రామాలో అతడు రక్తి కట్టిస్తున్నాడు. కొన్ని సార్లు యుద్ధంలో గగుర్పాటుకు గురిచేసే వాతావరణంలో పవర్ ఫుల్ డైలాగులతో అతడు ఆకట్టుకుంటున్నాడు. యువనటుడిని చూడగానే అమితాబ్ కి సిసలైన నటవారసుడు అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు.
వార్ డ్రామాలు, బయోపిక్ లలో ఎమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంది. నటుడు విక్కీ కౌశల్ కి యూరి సినిమా తెచ్చిన ఇమేజ్ ఇప్పుడు ఇక్కిస్ తో అగస్త్య అందుకుంటాడని బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు భావిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది.
