Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ఖాన్ల‌లా...ఈ ముగ్గురు ఎదుగుతున్నారా??

బాలీవుడ్ వెండితెరను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఘనత ఖాన్ త్ర‌యం (అమీర్, షారుక్, సల్మాన్) సొంతం.

By:  Srikanth Kontham   |   14 April 2026 5:00 AM IST
ఆ ముగ్గురు ఖాన్ల‌లా...ఈ ముగ్గురు ఎదుగుతున్నారా??
X

బాలీవుడ్ వెండితెరను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఘనత ఖాన్ త్ర‌యం (అమీర్, షారుక్, సల్మాన్) సొంతం. 90వ దశకం నుండి నేటి వరకు కంటెంట్, కమర్షియల్ హంగులు, బాక్సాఫీస్ రికార్డులతో భారతీయ సినిమాను శాసించారు. అయితే కాలక్రమేణా మారుతోన్న ప్రేక్షకుల అభిరుచి, మారుతోన్న మార్కెట్ సమీకరణాల నేపథ్యంలో ఖాన్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకునే సత్తా ఉన్న హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర పథంలో దూసుకుపోతున్న రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కపూర్ల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రణబీర్ కపూర్ కేవలం నటనతోనే కాకుండా వసూళ్ల పరంగానూ తన సత్తా చాటుతున్నారు.

యానిమల్ చిత్రంతో ఆయన సృష్టించిన సంచలనం బాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒక నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూనే మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆయనకు ఉందని నిరూపితమైంది. ఖాన్‌ల తరహాలోనే సుదీర్ఘ కాలం ఇండస్ట్రీని లీడ్ చేసే లక్షణాలు రణబీర్‌లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక‌ రణవీర్ సింగ్ శైలే వేరు. ఆయన ఎనర్జీ, వైవిధ్యమైన ఆహార్యం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ధురంధర్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలతో ఆయన నటనలోని లోతును ప్రపంచానికి పరిచయం చేశారు.

ఒకే రకమైన ఇమేజ్‌కు పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడంలో రణవీర్ దిట్ట. ఖాన్‌ల తర్వాత ఆ స్థాయి క్రేజ్ , గ్లోబల్ అప్పీల్ ఉన్న హీరోల్లో రణవీర్ ఒకరు. ధురంధ‌ర్ 2 విజ‌యంతో ర‌ణ‌వీర్ సింగ్ ఇమేజ్ రెండింత‌లు రెట్టింపు అయింది. ర‌ణ‌బీర్ క‌పూర్ ని సైతం రేసు నుంచి వెన‌క్కి నెట్టేసాడు.అలాగే ఇండ‌స్ట్రీలో విక్కీ కౌశల్ ఎదుగుదల చాలా నిశ్శబ్దం. ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడాయ‌న‌. కంటెంట్ ఆధారిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. నటనలో తీవ్రత, సహజత్వం విక్కీ బలం. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాకుండా కథాబలం ఉన్న చిన్న సినిమాలను కూడా విజయతీరాలకు చేర్చగల నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు.

అయితే ఖాన్‌ల కాలం నాటి మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు లేవు. నేడు ప్రేక్షకులు నటుడి కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం , ఓటీటీల రాకతో స్టార్‌డమ్ నిర్వచనం మారిపోయింది. ఖాన్‌లలా మూడు దశాబ్దాల పాటు స్థిరంగా ఉండాలంటే? ఈ ముగ్గురు హీరోలు హిట్‌లు సాధించడమే కాదు. మారుతున్న టెక్నాలజీని , ప్రేక్షకుల పల్స్‌ను నిరంతరం ప‌ట్టుకుని ప‌నిచేయాల్సి ఉంటుంది. అలా చేయ‌గ‌ల్గితే రణబీర్, రణవీర్, విక్కీ కౌశల్ ముగ్గురూ తమదైన శైలిలో బాలీవుడ్‌లో కొత్త శకాన్ని ఆరంభించ‌గ‌ల‌రు. భవిష్యత్తులో వీరు పాన్-ఇండియా రేంజ్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించి ఖాన్‌ల తరహాలోనే సినిమాను శాసించే స్థాయికి ఎదుగుతారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.