బాలయ్య ఎక్కడా తగ్గడం లేదే!
టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు మించి సీనియర్ హీరోలు ఎక్కడా తగ్గడం లేదు. ఏ విషయంలోనూ ఆగడం లేదు. ఒక ప్రాజెక్ట్ రిలీజ్ కాగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 17 Dec 2025 11:59 AM ISTటాలీవుడ్‌లో స్టార్ హీరోలకు మించి సీనియర్ హీరోలు ఎక్కడా తగ్గడం లేదు. ఏ విషయంలోనూ ఆగడం లేదు. ఒక ప్రాజెక్ట్ రిలీజ్ కాగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తున్నారు. కుర్ర హీరోలకు ధీటుగా బ్యాక్‌టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లని పట్టాలెక్కించేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో స్పీడు పెంచేస్తుంటే వారి తరహాలోనే సీనియర్ హీరో నందమూరి బాలయ్య కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా స్పీడు చూపించేస్తున్నారు. `అఖండ 2`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ఈ మూవీతో ఫరవాలేదు అనిపించాడు.
`అఖండ` తరహాలో మాత్రం ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బోయపాటి ఎంచుకున్న అతి హింస, అతి సీన్స్. దీన్ని పక్కన పెడితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా బాలయ్య బ్రేక్ తీసుకోవడం లేదు. అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేశాడు.అయితే ఇదే రెగ్యులర్ బాలయ్య మార్కు యాక్షన్ మూవీ కాదు. ఈ సారి భారీ పీరియాడిక్ మూవీతో పాన్ ఇండియాని గగ్గోలు పెట్టించాలని సిద్ధమవుతున్నాడు.
ఈ భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది బాలయ్య నటించనున్న 111వ ప్రాజెక్ట్. ఇందులో బాలయ్య డ్యుయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఓ ప్రతిష్టాత్మమైన కథతో అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పిక్ లో బాలయ్య హిస్టారికల్ లుక్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఒక గెటప్‌లో రాబిన్ హుడ్ తరహాలో, మరో గెటప్‌లో వారియర్‌గానూ కనిపిస్తున్న బాలయ్య నమూనా లుక్స్ ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉండనుందనే సంకేతాల్ని ఇచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేసింది.
ఈ నెల ప్రారంభంలోనే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. చాలా ఏళ్ల తరువాత బాలయ్య చేయబోతున్న పీరియాడిక్ ఫిల్మ్ కావడం, ఇందులో బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార జోడీగా నటించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.ఇంతకు ముందు బాలయ్యతో కలిసి నయనతార నటించిన `సింహా` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం తెలిసిందే. ఆ తరువాత `శ్రీరామరాజ్యం`లో మరో సారి కలిసి నటించారు. ఇది వీరి కలయికలో రానున్న మూడవ ప్రాజెక్ట్.
దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ని రాజస్థాన్ లోని కీలక ప్రదేశాల్లో, ఈస్ట్ గోదావరిలోని అందమైన లొకేషన్‌లలో చేయబోతున్నారట. గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య `వీరసింహారెడ్డి` చేశారు. ఇది వీరి కలయికలో రానున్న రెండవ సినిమా. అందులోనూ గోపీచంద్ మలినేని చేయబోతున్న తొలి పీరియాడిక్ ఫిల్మ్ కావడం గమనార్హం. డిసెంబర్ వరకు `అఖండ 2` ప్రమోషన్స్‌కే కేటాయించడంతో బాలయ్య ఈ మూవీ షూటింగ్ కోసం జనవరి నుంచి బరిలోకి దిగనున్నారట.
