Begin typing your search above and press return to search.

భారీ చిత్రాల బాక్సాఫీస్ విజయంలో టికెట్ ధరల వ్యూహం?

భారీ బడ్జెట్ చిత్రాల విజయానికి టికెట్ ధరల హేతుబద్ధీకరణ అనేది కీలకమైన అంశంగా మారింది .

By:  Srikanth Kontham   |   13 July 2026 6:00 PM IST
భారీ చిత్రాల బాక్సాఫీస్ విజయంలో టికెట్ ధరల వ్యూహం?
X

భారీ బడ్జెట్ చిత్రాల విజయానికి టికెట్ ధరల హేతుబద్ధీకరణ అనేది కీలకమైన అంశంగా మారింది . ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఓటిటి వైపు మొగ్గు చూపడం .. సినిమా చూడటాన్ని ప్రీమియం అనుభవంగా మార్చుకోవడంతో థియేటర్లకు వచ్చే సాధారణ ప్రేక్షకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు తగ్గించడం వల్ల పరిశ్రమలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ ధరలు అందుబాటులో ఉంటే? సామాన్య ప్రేక్షకులు కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.

భారీ చిత్రాలకు ఇది ప్రాణవాయువు లాంటిది. ప్రేక్షకుల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా థియేటర్లలో స్నాక్స్ .. ఇతర విక్రయాలు పెరిగి, ఎగ్జిబిటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. తద్వారా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడానికి బాటలు పడతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఒకే సినిమాను మళ్ళీ మళ్ళీ చూడటానికి ఇష్టపడతారు. ఇలా జ‌రిగితే ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద దీర్ఘకాలం కొనసాగడానికి .. భారీ లాభాలను సాధించడానికి దోహదపడుతుంది. ఒకేసారి చూసే చిత్రాల కంటే? రీ-వాచ్ విలువ ఉన్న చిత్రాలు పరిశ్రమకు మరింత ఆర్థిక బలాన్ని చేకూరుస్తాయి. ఇది చిత్ర నిర్మాతలకు పెట్టుబడిపై మంచి రాబడినిచ్చే అవకాశం ఉంటుంది.

ప్రజాదరణ .. వర్డ్ ఆఫ్ మౌత్ విషయంలో కూడా ధరల తగ్గింపు కీలకం. టికెట్ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ మంది సినిమాను చూస్తారు. ఇది సినిమాపై సానుకూల స్పందన వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయ పడుతుంది. తద్వారా సినిమా బ్రాండ్ విలువ పెరిగి సామాన్య ప్రేక్షకుడికి కూడా సినిమా చేరువవుతుంది. ఇది కేవలం మల్టీప్లెక్సులకే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా కొత్త ఊపిరిని పోస్తుంది.

ప్రభుత్వం స్థిరమైన టికెట్ ధరల విధానాన్ని అమలు చేస్తే ప్రతి సినిమా విడుదల ముందు నిర్మాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి నిర్మాతలు ..డిస్ట్రిబ్యూటర్లు ధైర్యంగా కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు అవ‌కాశం కల్పిస్తుంది. పరిశ్రమలో పారదర్శకత పెరగడానికి మార్గం సుగమం అవుతుంది.

భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే? కేవలం స్టార్ డమ్ మాత్రమే సరిపోదు. టికెట్ ధరలు సామాన్యుడికి భారం కాకుండా ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడుతాయి. పరిశ్రమ ఆర్థికంగా స్థిరపడుతుంది. బాక్సాఫీస్ వద్ద దీర్ఘకాలిక వృద్ధిని ఆశించే ఏ చిత్ర పరిశ్రమ అయినా? ధరల నిర్వహణలో సమతుల్యతను పాటించడం అత్యవసరం. ఇలా చేసిన‌ప్పుడు మ‌ళ్లీ సినిమాలు పాత రోజుల్ని త‌ల‌పిస్తాయి. ఒక్కో సినిమా 50 రోజులు..100 రోజులు ఆడే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా అర్థ‌శ‌త‌, శ‌త దినోత్స వేడుక‌లు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. తెలుగు సినిమా నేడు ప్ర‌పంచ స్థాయిలో గొప్ప ఇండ‌స్ట్రీగా నిల‌బ‌డిందంటే? కార‌ణం పెద్ద‌లు బవేసిన బ‌ల‌మైన పునాదులే అన్న‌ది ఎప్ప‌టికీ మ‌రువ కూడ‌దు.