Begin typing your search above and press return to search.

మూడు రోజులు.. మూడు ఈవెంట్స్.. న్యూయార్క్‌లో అడివి శేష్

ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆగస్టు 14న ప్రతిష్టాత్మక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను భారత త్రివర్ణ పతాక రంగులతో హైలెట్ అయ్యే కార్యక్రమంలో శేష్ పాల్గొనబోతున్నాడు.

By:  M Prashanth   |   13 Aug 2026 11:38 PM IST
మూడు రోజులు.. మూడు ఈవెంట్స్.. న్యూయార్క్‌లో అడివి శేష్
X

టాలీవుడ్ హీరో అడివి శేష్‌కు అమెరికాలో ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు న్యూయార్క్ నగరంలో జరగనున్న 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, టైమ్స్ స్క్వేర్, ఇండియా డే పరేడ్ లాంటి మూడు ఐకానిక్ వేదికలపై జరిగే ఈ కార్యక్రమాలకు ఒక తెలుగు నటుడు ప్రాతినిధ్యం వహించడం నిజంగా విశేషం.

ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆగస్టు 14న ప్రతిష్టాత్మక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను భారత త్రివర్ణ పతాక రంగులతో హైలెట్ అయ్యే కార్యక్రమంలో శేష్ పాల్గొనబోతున్నాడు. ఈ త్రికలర్ ఇల్యూమినేషన్ కోసం ఏర్పాటు చేసిన సెరిమోనియల్ లివర్‌ను ఆపరేట్ చేసే అవకాశం ఆయనకు దక్కనుంది. న్యూయార్క్ నగర నడిబొడ్డున ఎంతో గ్రాండ్ గా జరిగే ఈ ఈవెంట్ అక్కడి ప్రవాస భారతీయులకు చాలా స్పెషల్.

ఆ మరుసటి రోజు ఆగస్టు 15న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ వారు టైమ్స్ స్క్వేర్ దగ్గర నిర్వహించే జెండా పండుగలో శేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతాడు. అమెరికాలో ఉండే మన దేశస్థుల సమక్షంలో జరిగే ఈ పతాకావిష్కరణ వేడుకలో ఆయన భాగమవుతాడు. ఇండిపెండెన్స్ డే రోజున ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ లాంటి చోట ఈ జాతీయ స్థాయి వేడుక జరగడం ఆసక్తికరం.

ఇక చివరి రోజు ఆగస్టు 16న న్యూయార్క్ లోని మాడిసన్ అవెన్యూలో జరిగే 44వ ఇండియా డే పరేడ్‌లో కూడా శేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటాడు. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా, భారీ సంఖ్యలో తరలివచ్చే ఈ పరేడ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రోజుల పాటు న్యూయార్క్ వీధుల్లో వందలాది మంది భారతీయుల మధ్య జరిగే సంబరాల్లో శేష్‌కు ఒక ప్రత్యేక స్థానం దక్కడం ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే విషయం.

సినిమాల విషయానికి వస్తే శేష్ రీసెంట్ గా డకాయిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం శేష్ తన సూపర్ హిట్ ఫ్రాంచైజీ గూఢచారికి సీక్వెల్ గా వస్తున్న 'జీ2' పనుల్లో బిజీగా ఉన్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు.