Begin typing your search above and press return to search.

చిన్న బడ్జెట్.. పెద్ద హిట్.. శేష్ ఒపీనియన్ ఏంటి?

టాలీవుడ్‌ లో తక్కువ బడ్జెట్‌ తోనే భారీ విజయాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

By:  M Prashanth   |   10 April 2026 9:26 AM IST
చిన్న బడ్జెట్.. పెద్ద హిట్.. శేష్ ఒపీనియన్ ఏంటి?
X

టాలీవుడ్‌ లో తక్కువ బడ్జెట్‌ తోనే భారీ విజయాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. తన లేటెస్ట్ మూవీ డెకాయిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

'తక్కువ బడ్జెట్‌ తో ఇంత పెద్ద బాక్సాఫీస్ విజయాలు ఎలా సాధిస్తున్నారు?' అన్న ప్రశ్నకు శేష్ చాలా కూల్ గా లోతైన సమాధానం ఇచ్చారు. తన విజయానికి ప్రధాన కారణం స్క్రిప్ట్ సెలెక్షన్ అని ఆయన స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి సినిమా విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కష్టపడి చేసే కథలే చివరకు ఫలితాన్ని ఇస్తాయంటూ పరోక్షంగా తెలిపారు.

సినిమా నిర్మాణంలో ముఖ్యమైన మూడు అంశాలను ఆయన వివరించారు.. అవే టైమ్, ఎఫర్ట్, డబ్బు. 'ఒక మంచి సినిమా చేయాలంటే ఈ మూడింటిలో కనీసం రెండైనా ఉండాలి. టైమ్ లేకపోతే ఖర్చు పెరుగుతుంది. ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే కష్టపడకపోతే టైమ్ ఎక్కువ పడుతుంది, డబ్బు కూడా ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే ఈ మూడింటిలో బ్యాలెన్స్ చాలా ముఖ్యం' అని చెప్పారు.

అలాగే తాను తక్కువ బడ్జెట్‌ తో చేసిన సినిమాలకు ఎక్కువ విలువ తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచనను కూడా వివరించారు. 'నేను కోటి రూపాయలతో క్షణం సినిమా తీశా. కానీ ఆ సినిమా విలువ మాత్రం రూ.10 కోట్లు' అని శేష్ అన్నారు. ఈ సందర్భంగా క్షణం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు.

'ఆ సినిమాలో ఒక సీన్ కోసం కారు అవసరం వచ్చింది. అప్పుడు నటుడు సుమంత్‌ ను సంప్రదించి, దివంగత ఏఎన్నార్ గారి బెంజ్ కారును వాడుకునే అవకాశం తీసుకున్నా. అదే కారు బయట నుంచి తీసుకుంటే రోజుకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. ఐదు రోజులకు అది పెద్ద మొత్తమవుతుంది. కానీ నేను నా నమ్మకాన్ని ఉపయోగించి, కారు సేఫ్‌ గా తిరిగి ఇస్తానని హామీ ఇచ్చి తీసుకున్నాను' అని తెలిపారు.

తానే స్వయంగా డ్రైవ్ చేసి తీసుకెళ్లానని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తక్కువ బడ్జెట్ గా కాకుండా చాకిరిగా చూడాలని నవ్వుతూ చెప్పారు. 'నేను ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చాను. నాకు నా సినిమా మీదే ఎక్కువ విలువ ఉంటుంది. నా కంటే సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా' అని శేష్ పేర్కొన్నారు. ఆ కామెంట్స్ ఇప్పుడు యువ దర్శకులు, నిర్మాతలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పాలి. తక్కువ సోర్స్ తో కూడా మంచి కంటెంట్, సరైన ప్లానింగ్ ఉంటే విజయాన్ని సాధించవచ్చని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.