సముద్రంలో చాలా చేపలుంటాయి.. కానీ మేము గోల్డ్ ఫిష్
అడివి శేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆయన చేసే ప్రయోగాలు, ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవు.
By: M Prashanth | 18 Dec 2025 5:48 PM ISTఅడివి శేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆయన చేసే ప్రయోగాలు, ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవు. ఇప్పుడు 'డెకాయిట్' అనే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మార్చి 19న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇదే డేట్ గురించి టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది.
బాలీవుడ్ లో అదే సమయంలో వచ్చే పోటీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు శేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. మార్చి 19న హిందీలో భారీ సినిమా 'ధురంధర్ 2' విడుదల కానుంది. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అక్కడ క్రేజ్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి, సెకండ్ పార్ట్ మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో డెకాయిట్ లాంటి సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అవుతుందేమో అని ఒక రిపోర్టర్ శేష్ ను నేరుగా ప్రశ్నించారు.
హిందీ మార్కెట్ పరంగా ఇది 'బ్యాడ్ డేట్' ఏమో అని సందేహం వ్యక్తం చేశారు. దానికి శేష్ చాలా కాన్ఫిడెంట్ గా, తనదైన శైలిలో బదులిచ్చారు. గతంలో తన 'మేజర్' సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి పోటీనే ఎదురైందని గుర్తు చేశారు. అప్పుడు ఒక వైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ పృథ్వీరాజ్ సినిమా, మరో వైపు కమల్ హాసన్ 'విక్రమ్' లాంటి భారీ చిత్రాలు ఉన్నా కూడా 'మేజర్' సత్తా చాటిందని అన్నారు. కంటెంట్ ఉంటే పోటీ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నది ఆయన ఉద్దేశం.
ఈ సందర్భంలోనే శేష్ ఒక అదిరిపోయే పంచ్ డైలాగ్ వేశారు. "సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు.. కానీ మేము గోల్డ్ ఫిష్" అని సింపుల్ గా తేల్చి చెప్పేశారు. అంటే సైజులో చిన్నదైనా, తన సినిమా విలువ, క్వాలిటీ వేరని ఆయన చెప్పకనే చెప్పారు. గోల్డ్ ఫిష్ కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుందని, అది ఆడియెన్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.
నిజానికి అడివి శేష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి కారణం వాటిలోని కంటెంటే. గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి సినిమాలు పోటీ ఉన్నా కూడా కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు డెకాయిట్ కూడా అదే నమ్మకంతో వస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాకు గ్లామర్ అడ్వాంటేజ్ కూడా ఉంది. హిందీలో మృణాల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. ధురంధర్ 2 లాంటి సునామీ వచ్చినా, ఈ గోల్డ్ ఫిష్ మాత్రం ఈజీగా ఈదేస్తుందని శేష్ ఫిక్స్ అయ్యారు. మరి మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో, శేష్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
