అడవి శేషు జీవితంలోనూ ప్రేమ విఫలం!
ఆ సమయంలోనే అడివి శేష్ సినిమాల్లోకి రావాలని, నటుడిగా నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడుట.
By: Srikanth Kontham | 2 April 2026 1:47 PM ISTయంగ్ అండ్ ప్రామిసింగ్ స్టార్ అడివి శేష్ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెరపై ఎక్కువగా దేశభక్తి, సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రల్లో కనిపించే శేష్ వ్యక్తిగత జీవితంలోనూ ఒక విషాదకరమైన ప్రేమకథ ఉందనే విషయం ఇటీవల బయటకు వచ్చింది. తన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో తాను ఒక అమ్మాయితో గాఢమైన ప్రేమలో ఉన్నానని తాజాగా వెల్లడించారు. ఆ సమయంలోనే అడివి శేష్ సినిమాల్లోకి రావాలని, నటుడిగా నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడుట.
ఆ సమయంలో కెరీర్ కంటే కూడా తన ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని చెప్పుకొచ్చాడు. ప్రేమించిన అమ్మాయి కోసం తన సమయాన్ని, శ్రమను వెచ్చించడమే కాదు. ఆమెను కలుసుకోవడానికి అమెరికా నుండి కెనడా వరకు ప్రయాణించానన్నాడు. ఆ రోజుల్లో తన ప్రపంచం మొత్తం ఆ అమ్మాయి చుట్టూనే తిరిగేదని భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడిన శేష్ కేవలం ఆమెతో గడపడం కోసం కెనడా వెళ్లడం ఆయనలోని ప్రేమికుడిని చాటిచెబుతోంది. ఒకవైపు సినిమాల కోసం ఆడిషన్లు ఇస్తూనే మరోవైపు తన ప్రేమను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నించాడని శేష్ మాటల్లో అర్దమవుతుంది.
ఎంతటి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ విధి వైపరీత్యం వల్ల వారిద్దరి మధ్య కొన్ని అనివార్య కారణాలు తలెత్తాయి. ఆ కారణాల వల్ల వారి ప్రేమ వివాహం వరకు వెళ్లలేకపోయింది. చివరికి ఆ ప్రేమకథ విఫలం కావడంతో అడివి శేష్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత తన జీవితంలో ఏర్పడిన వెలితిని భర్తీ చేసుకోవడానికి ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించాడు. తనలోని బాధను, ఆవేదనను వెండితెరపై నటన రూపంలో చూపించడానికి ప్రయత్నించాడు. ఆ వైఫల్యమే ఆయనను ఒక పరిపూర్ణమైన నటుడిగా, రచయితగా తీర్చిదిద్ద డంలో పరోక్షంగా దోహదపడిందని చెప్పొచ్చు.
అడివి శేష్ జీవితంలోని ఈ ప్రేమకథ ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెరపై హీరోగా అందరినీ అలరించే శేష్ నిజ జీవితంలో ఒక సాధారణ ప్రేమికుడిగా ఎదుర్కొన్న ఓటమి ఆయనలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న శేష్ గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన రాబోయే చిత్రాల్లో ఈ అనుభవాలు మరిన్ని సహజమైన భావోద్వేగాలను పండిస్తాయని ఆశించవచ్చు. ప్రస్తుతం శేషు హీరోగా నటిస్తోన్న `డెకాయిట్` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి త తెలిసిందే.
ఈసినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. అలాగే స్పై థ్రిల్లర్ `గుఢచారి 2` కూడా తెరకెక్కుతోంది. ఆ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. `ధురంధర్` రెండు భాగాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో స్పై సినిమాలకు డిమాండ్ పెరిగింది. వాటిపై అంచనాలు కూడా భారీగా ఏర్పడుతున్నాయి. `గుఢఛారి`2 కూడా సరైన టైమ్ లోనే రిలీజ్ అవుతుంది.
