అడివి శేష్ 'డెకాయిట్'.. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే..
ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ సినిమాపై విడుదల ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. వాటిని ఆ చిత్రం అందుకున్నట్లు కనిపిస్తోంది.
By: M Prashanth | 13 April 2026 2:21 PM ISTటాలీవుడ్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ సినిమాపై విడుదల ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. వాటిని ఆ చిత్రం అందుకున్నట్లు కనిపిస్తోంది.
ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, అలాగే రుబారు, చిచ్చుబుడ్డి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి.
అయితే విడుదలైన మొదటి రోజున సినిమాకు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం స్ట్రాంగ్ గా నమోదయ్యాయి. తర్వాత రోజుల్లో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ రావడంతో కలెక్షన్లు కూడా మెరుగయ్యాయి. ముఖ్యంగా వీకెండ్ లో సినిమా మంచి రన్ ను సాధించింది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రం రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.
సుమారు రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ.48 కోట్లు రాబట్టింది. దీంతో థియేట్రికల్ గా కేవలం రూ.17 కోట్లు వస్తే సరిపోతుందనే సేఫ్ జోన్ లోకి చేరింది. ఇప్పటికే మూడు రోజుల్లోనే ఆ టార్గెట్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ సాధించడం గమనార్హం. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
ఇక ఇప్పుడు వీక్ డేస్ ప్రారంభం కావడంతో డెకాయిట్ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం సినిమాకు ప్లస్ గా మారింది. అదేవిధంగా పాజిటివ్ టాక్ కొనసాగుతుండటంతో ప్రేక్షకుల రెస్పాన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులకు సెలవులు ఉండటం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపే అంశంగా చెప్పాలి.
అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు సాయంత్రం వేళల్లో జరుగుతున్నప్పటికీ, పగటి షోలలో ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి.. డెకాయిట్ ఇప్పటికే లాభాల్లోకి వెళ్లడంతో ఇకపై వచ్చే వసూళ్లన్నీ మేకర్స్ కు అదనపు లాభాలుగా మారనున్నాయి. అందుకే అదే ఊపును కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఆ సినిమా మరింత స్ట్రాంగ్ బాక్సాఫీస్ రన్ ను నమోదు చేసే అవకాశం ఉందని చెప్పాలి.
