డెకాయిట్ 'చిచ్చుబుడ్డి'.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శేష్..
వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరో అడివి శేష్.. తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తుంటారు.
By: M Prashanth | 28 March 2026 11:49 PM ISTవరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరో అడివి శేష్.. తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తుంటారు. ఇప్పటివరకు క్లాస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ఇప్పుడు మాస్ ట్రాక్ లోకి అడుగుపెట్టారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ నుంచి విడుదలైన రెండో పాట చిచ్చుబుడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ పాటతో శేష్ తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సాధారణంగా ఆయన సినిమాల్లో డ్యాన్స్ కంటే కథ, మైండ్ గేమ్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే చిచ్చుబుడ్డి సాంగ్ లో మాత్రం హై-ఎనర్జీ మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్ ను అలరించారు. రగ్గడ్ లుక్ లో కనిపిస్తూనే గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో అదరగొట్టడం విశేషం. పాటలో శేష్ చూపించిన ఉత్సాహం, స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఆ సాంగ్ కు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో, ఫోక్ బీట్ తో కూడిన మాస్ నంబర్ గా కంపోజ్ చేశారు. ఆయన అందించిన బీట్స్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సాహిత్యాన్ని అందించిన భాస్కరభట్ల రవికుమార్ తనదైన స్టైల్లో సరదాగా, క్యాచీగా ఉండే పదాలతో పాటకు ఎనర్జీని పెంచారు. రామ్ మిరియాల, జోనితా గాంధీ తమ వాయిస్ తో సాంగ్ కు కొత్త ఊపు తీసుకొచ్చారు.
ముఖ్యంగా జోనితా గాంధీ ఆ పాటను పాడటమే కాకుండా తెరపై గ్లామరస్ డ్యాన్స్ తో కూడా మెరిశారు. భోజ్ పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేకంగా కనిపించడం పాటకు మాస్ అప్పీల్ ను మరింత పెంచింది. భారీ సెట్స్ మధ్య, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులతో పాటను ఎంతో రిచ్ గా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక వేడుకలా కనిపిస్తూ, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా నిలుస్తోంది. కొరియోగ్రఫీ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ రూబరూలో శేష్ పాత్రలోని ఎమోషనల్ యాంగిల్ చూపించగా, చిచ్చుబుడ్డి.. మాత్రం పూర్తిగా విభిన్నమైన మూడ్ ను తీసుకొచ్చింది. దీంతో డెకాయిట్ సినిమా కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా ప్రేమ, ద్రోహం, కోపం, ఉత్సాహం వంటి ఎమోషన్స్ నిండిన కథగా ఉండబోతుందని అర్థమవుతోంది.
ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది దర్శకుడిగా తొలి సినిమా కావడం విశేషం. శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అయితే చిచ్చుబుడ్డి పాట విడుదలతో డెకాయిట్ పై అంచనాలు మరింత పెరిగాయి. మాస్, క్లాస్ ఎలిమెంట్స్ తో సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
