'చందమామ'కి అడవి శేష్‌కి కనెక్షన్...!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో 'చందమామ' సినిమా ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Ramesh Palla | 9 April 2026 1:00 PM ISTక్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో 'చందమామ' సినిమా ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో మంచి రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఆ సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. ఇక ఆ సినిమాలో నాగబాబు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా కాజల్‌కి జోడీగా నటించిన నవదీప్ సైతం మంచి పేరును సొంతం చేసుకున్నాడు. కృష్ణవంశీ తనదైన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చందమామ సినిమాను రూపొందించారు. చిన్న సినిమాగా వచ్చిన చందమామకి ప్రేక్షకులు పెద్ద విజయాన్ని కట్టబెట్టారు. అందుకే ఆ సినిమా ఇప్పటికి... ఎప్పటికీ స్పెషల్ అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటారు. అలాంటి స్పెషల్ మూవీలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి అడవి శేష్‌కి చేజారిందట.
అడవి శేష్ డెకాయిట్ మూవీతో...
'డెకాయిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అడవి శేష్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డెకాయిట్ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అడవి శేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను గురించి చెప్పుకొచ్చాడు. తాను ఎదుర్కొన్న అవమానాలను ఎప్పుడూ కూడా మనసుకు తీసుకోకుండా, మరింతగా కష్టపడి సక్సెస్ కావడం కోసం కృషి చేశాను అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం దక్కింది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత నా నటన ఆయనకు నచ్చక పోవడంతో మొత్తం షూటింగ్ ఆపేశారు, ఆ సినిమా నుంచి నన్ను తొలగించారు అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు.
చందమామ సినిమాలో హీరోగా...
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నవదీప్ పోషించిన పాత్ర కోసం మొదట అడవి శేష్‌ను తీసుకోవడం, కొంత మేరకు షూటింగ్ చేయడం జరిగిందట. కానీ అడవి శేష్ నటుడిగా అప్పటికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాడు. దాంతో కృష్ణవంశీ అంచనాలను ఆయన అందుకోవడంలో విఫలం అయ్యాడట. కొన్ని రోజులు అయినా కూడా కృష్ణవంశీ కోరుకున్నట్లుగా అడవి శేష్ నుంచి యాక్టింగ్ మెరుగుదల కనిపించక పోవడంతో మొత్తం ప్రాజెక్ట్‌ను ఆపేశాడట. ఈ విషయాన్ని స్వయంగా అడవి శేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో సినిమాకు చందమామ కాకుండా మల్లెపువ్వు అనే టైటిల్‌ను అనుకున్నారట. మల్లెపువ్వు టైటిల్‌తోనే కొన్ని రోజుల షూటింగ్ నిర్వహించడం, ఆ షూటింగ్‌లో తాను పాల్గొనడం జరిగిందని అడవి శేష్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో...
అడవి శేష్ ను తొలగించిన తర్వాత కొన్ని రోజులకు ఆ స్థానంలో నవదీప్ ను ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభించారట. అయితే మల్లెపువ్వు కాకుండా టైటిల్‌ను చందమామ అని కన్ఫర్మ్ చేసినట్లుగా అడవి శేష్ అన్నాడు. కృష్ణవంశీ గారికి ప్రతి నటుడు బెస్ట్ ఇవ్వాలి, అలా ఇవ్వకుంటే ఆయనకు నచ్చదు, అందుకే ఆ సమయంలో తనను సినిమా నుంచి తొలగించాడని శేష్ అన్నాడు. ఆ సినిమా నుంచి తప్పించడంతో యాక్టింగ్ పై శేష్ మరింతగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం చందమామ సినిమా నుంచి మాత్రమే కాకుండా అడవి శేష్ కి చేతి వరకు వచ్చి మరికొన్ని సినిమాలు కూడా చేజారాయి. అయితే ప్రతి ఫెయిల్యూర్ నుంచి మరింతగా కష్టపడుతూ అడవి శేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వంద కోట్ల హీరో అనిపించుకున్నాడు. అడవి శేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తే స్థాయికి చేరుకున్నాడు.
డెకాయిట్‌తో మరో విజయాన్ని అడవి శేష్ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని అంతా నమ్ముతున్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న అడవి శేష్ కి ఇప్పటికే యాక్టింగ్‌లో పలు అవార్డ్‌లు వచ్చిన విషయం తెల్సిందే. ఒకప్పుడు యాక్టింగ్ బాగాలేదు అంటూ తిరస్కరణకు గురి అయిన శేష్ ఆ తర్వాత ఉత్తమ నటుడు అనిపించుకున్నాడు అంటే ఏ స్థాయిలో కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
