విజయంతో అవకాశాల వెల్లువ!
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒకే ఒక్క పాత్రతో ఆదిత్య ఉప్పల్ సినీ కెరీర్ మలుపు తిరిగింది.
By: Srikanth Kontham | 1 April 2026 7:00 AM ISTఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒకే ఒక్క పాత్రతో ఆదిత్య ఉప్పల్ సినీ కెరీర్ మలుపు తిరిగింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `దురంధర్` లో ఏఎస్పీ ఒమర్ హైదర్ పాత్రలో ఆదిత్య నటించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకానొక దశలో వ్యాపారానికే అంకితమై నటనకు దాదాపు దూరమైన ఆదిత్య ఉప్పల్ దర్శకుడు ఆదిత్య ధర్ నమ్మకంతో మళ్లీ వెండితెరపై మెరిశారు. ఈ ఒక్క అవకాశం ఆదిత్య జీవితాన్నే మార్చేసింది. సినిమా విడుదలైన అనంతరం ఆదిత్య ఉప్పల్ పేరు మారుమోగిపోతోంది.
ముఖ్యంగా సినిమా రెండవ భాగం ముగింపులో ఆయన పాత్రకు దక్కిన ప్రాధాన్యత, ఆ సన్నివేశం వైరల్ కావడంతో ప్రేక్షకులకు మరింత రీచ్ అయ్యాడు. ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందేమోనని భయపడిన ఆదిత్యకు `దురంధర్` విజయం ఓ వరంలా మారింది. ఒక నటుడిగా ఉనికిని చాటుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం రెండు వేల మంది ఫాలోవర్లతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు యాభై వేల ఫాలోవర్ల మార్కును దాటి దూసుకుపోతోంది.
పాత్రలో ఆదిత్య నటన, ముఖ్యంగా హమ్జా పాత్రను హింసించే సీన్లలో ఆయన నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఆదిత్యకు వస్తోన్న సందేశాలు చూస్తుంటే? ఆయన ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ముద్ర వేయగలిగారో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆదిత్య ఉప్పల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. గతంలో అవకాశాల కోసం ఎదురుచూసిన ఆదిత్యకు కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో ఎనిమిదేళ్ల నిరీక్షణ , కఠిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కిందని ఆదిత్య భావిస్తున్నాడు. ప్రస్తుతం ఆదిత్య ఉప్పల్ ధురంధర్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
దీనిలో భాగంగా భార్య పిల్లలతో గోవా ట్రిప్ వెళ్లాడు. తిరిగొచ్చిన తర్వాత కొత్త చిత్రాలకు సంబంధించి దర్శకులతో చర్చించడానికి సిద్ద మవుతున్నాడు. నటనపై మక్కువ ఉన్న ఏ కళాకారుడికైనా సరైన అవకాశం దొరికితే కెరీర్ ఎంతలా మారుతుందో ? చెప్పడానికి ఆదిత్య ఉప్పల్ ప్రయాణం మరో ఉదాహరణాగా చెప్పొచ్చు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని పక్కనపెట్టి మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన ఆదిత్య ఇకపై వెండితెరపై వరుసగా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఆదిత్య ఉప్పల్ అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైం దని చెప్పొచ్చు. మరి ఇతగాడి ప్రతిభతో తెలుగులోనూ అవకాశాలు అందుకుంటాడేమో చూడాలి.
