మూడు ఐటెం సాంగ్స్.. మార్కెటింగ్ కోసమా? ఫ్లో దెబ్బతీయడానికా?
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన థామ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటోంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Nov 2025 1:00 PM ISTఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన థామ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటోంది. థామాకు మంచి వసూళ్లు దక్కుతున్నప్పటికీ ఆడియన్స్ ఈ సినిమాలోని ఓ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థామాలో ఏకంగా మూడు ఐటెం సాంగ్స్ ఉండటంతో ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.
థామాలో మూడు ఐటెం సాంగ్స్
ఈ సాంగ్స్ మూవీనీ నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేలా కథకు బూస్టప్ ను ఇచ్చాయా లేదా సినిమాలోని అసలు విషయాన్ని పక్కదోవ పట్టించాయా అనే దిశగా ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే థామాలో మూడు సాంగ్స్ ను పెట్టిన తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ డైరెక్టర్ ఆదిత్య సర్పోత్దార్, ఆ సాంగ్స్ ను కథను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడే మార్కెటింగ్ ఆస్తులుగా పరిగణించారు.
ఫ్లో ను దెబ్బ తీసేలా పాటలు
కానీ ఈ విషయంలో ఎవరూ డైరెక్టర్ తో ఏకీభవించడం లేదు. ఈ పాటల వల్ల సినిమాలోని హార్రర్ కామెడీ రిథమ్ మిస్ అవడంతో పాటూ ఎక్కువగా మ్యూజిక్ వైపే ఫోకస్ వెళ్లిందని ఆడియన్స్ భావిస్తున్నారు. ముంజ్య, స్త్రీ సినిమాల్లో మ్యూజిక్ కూడా కథతో కలిసిపోతుంది కానీ థామాలో సాంగ్స్ అలా కాదని, ఈ పాటలు సినిమా ఫ్లో ను దెబ్బతీశాయని, డైరెక్టర్ తీయాలనుకున్న సూపర్ నేచురల్ కథను ఈ మ్యూజిక్ బలహీనపరిచిందని ఆడియన్స్ అంటున్నారు.
థామా మూవీలో బలమైన క్యాస్టింగ్ తో పాటూ మడోక్ హార్రర్ కామెడీ యూనివర్స్ లాంటి వాటితో సంబంధాలున్నప్పటికీ ఈ సినిమా వాటి ముందు వచ్చిన సినిమాల్లాగా ఎలాంటి సంచలనాలు సృష్టించలేకపోయింది. సినిమా మార్కెటింగ్ కోసం సాంగ్స్ ను ఉపయోగించాలనుకోవడంపై డైరెక్టర్ కు ఓ స్పష్టమైన అభిప్రాయమున్నప్పటికీ ఆ సాంగ్స్ మరీ మోతాదుని మించి ఉన్నాయన థామా నిరూపించింది.
