మాటలతో కాదు చేతలతో నిరూపించండి!
బాలీవుడ్‌లో ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకుల మధ్య పరోక్షంగా సాగుతున్న మాటల యుద్ధం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Srikanth Kontham | 8 April 2026 10:00 PM ISTబాలీవుడ్‌లో ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకుల మధ్య పరోక్షంగా సాగుతున్న మాటల యుద్ధం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే `ధురంధర్` లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన ఆదిత్య ధర్, మరోవైపు `పఠాన్`, `ఫైటర్` వంటి భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మధ్య భిన్నాభిప్రాయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ వివాదం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలా కాకుండా సినిమా మేకింగ్ శైలిపై జరుగుతున్న చర్చగా మారింది.
ఇటీవల ఓ షోలో ఆదిత్య ధర్ మాట్లాడుతూ బాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న ట్రెండ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు దర్శకులు కేవలం పెద్ద పెద్ద స్టార్లను నమ్ముకుని, భారీ బడ్జెట్‌లతో సినిమాలను రూపొందిస్తున్నారని, కానీ కథలో బలం లేకపోవడంతో అవి చెత్త సినిమాలుగా మిగిలిపోతున్నాయని విమర్శించారు. స్టార్‌డమ్ వెనుక పరిగెత్తే క్రమంలో కంటెంట్‌ను విస్మరిస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ వ్యాఖ్యలు నేరుగా భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులను ఉద్దేశించినవే అని నెటిజన్లు భావించారు. ఆదిత్య ధర్ చేసిన ఈ విమర్శలకు సిద్ధార్థ్ ఆనంద్ అంతే ధీటుగా బదులిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ `కేవలం మాటలతో మేధావిలా అనిపించుకోవడం సులభం.
కానీ మీ పనితో అది నిరూపించుకోండి అనే అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చారు. అంటే సిద్ధాంతాలు చెప్పడం కంటే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి చూపడమే అసలైన ప్రతిభ అని సిద్ధార్థ్ ఆనంద్ పరోక్షంగా హెచ్చరించారు. ఈ క్రిప్టిక్ పోస్ట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి వీరిద్దరి వాదనల్లోనూ గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. ఆదిత్య ధర్ చెప్పినట్టుగా కేవలం గ్రాండియర్, భారీ తారాగణం ఉంటే సరిపోదు. ప్రేక్షకుడిని మెప్పించే కథ ఉండాలి. అయితే సిద్ధార్థ్ ఆనంద్ వాదన ప్రకారం వేల కోట్ల వసూళ్లు రాబట్టే భారీ కమర్షియల్ సినిమాలను రూపొందించడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కూడా ఒక గొప్ప నైపుణ్యమే.
భారీ బడ్జెట్ సినిమాలపై విమర్శలు చేయడం కంటే కంటెంట్‌తో వాటిని మించి చూపాలని ఆయన సవాల్ విసి రారు. ఈ ఇద్దరు దర్శకుల మధ్య జరుగుతోన్న కోల్డ్ వార్ బాలీవుడ్ మారుతున్న తీరుకు అద్దం పడుతోంది. అగ్ర దర్శకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడం వల్ల అంచనాలు పెరగడమే కాదు. వారు తీయబోయే తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడుతుంది. `ధురంధర్` తో సత్తా చాటిన ఆదిత్యధర్ కు ధీటుగా సిద్దార్ద్ అసలైన విజయంతో బధులివ్వాలి. ప్రస్తుతం షారుక్ ఖాన్ కథానాయకుడిగా `కింగ్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదే సినిమాతో షారుక్ కుమార్తె లాంచ్ అవుతుంది.
