లిరిసిస్ట్ నుంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వరకు..
అది ఏ విషయంలోనైనా నిజమేనని సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ లైఫ్ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది
By: Sravani Lakshmi Srungarapu | 16 Dec 2025 4:00 AM ISTఏదైనా జరగాల్సిన టైమొచ్చినప్పుడే జరుగుతుందని పెద్దలు ఊరికే అనలేదు. అది ఏ విషయంలోనైనా నిజమేనని సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ లైఫ్ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ సినిమాకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. దురంధర్ ఆదిత్యధర్‌కు రెండో సినిమానే.
యురితో డైరెక్టర్ గా మారిన ఆదిత్య ధర్
దాని కంటే ముందు అతని దర్శకత్వంలో యురి: ది సర్జికల్ స్ట్రైక్ అనే పేరుతో సినిమా రాగా ఆ సినిమా కూడా దురంధర్ లాగానే ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆదిత్య నుంచి రెండో సినిమా రావడానికి చాలా కాలమే పట్టింది. రూ.30 కోట్లు పెట్టి యురి సినిమా సినిమా తీస్తే అది ఏకంగా రూ.350 కోట్లు కలెక్ట్ చేసింది.
డైరెక్టర్ కంటే ముందు లిరిసిస్ట్‌గా..
ఈ రెండింటికీ మధ్యలో ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే మూవీపై కొన్నేళ్లు వర్క్ చేశారు ఆదిత్య. బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల అది ముందుకెళ్లలేదు. దీంతో తానే నిర్మాతగా మారి దురంధర్ సినిమాను మొదలుపెట్టడమే కాకుండా ఒకేసారి రెండు భాగాలనూ కంప్లీట్ చేసి ఫస్ట్ పార్ట్ తో సూపర్ హిట్ ను అందుకుని రెండో భాగాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆదిత్య, ముందుగా లిరిసిస్ట్ గా వర్క్ చేసి తర్వాత డైలాగ్స్, స్క్రీన్ ప్లే రైటింగ్ లోకి అడుగుపెట్టి తేజ్, ఆక్రోశ్ లాంటి సినిమాలకు వర్క్ చేశారు.
పదేళ్ల పాటూ ఎంతో కష్టపడ్డాక మధ్యలో డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టి, రాత్ బాకీ అనే మూవీని ఓకే చేసుకున్నారు. కానీ అది కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు కదల్లేదు. ఆ సినిమాలో కీలక పాత్రల కోసం పాకిస్తానీ నటులను తీసుకోగా యురీ ఎటాక్స్ కారణంగా వారిపై నిషేధం పడింది. దీంతో యురి ఎటాక్స్ పైనే ఓ కథ రాసి ఆ సినిమాను తెరకెక్కించి దాంతో డైరెక్టర్ గా మారడమే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు ఆదిత్య ధర్. ఏదేమైనా ఇప్పుడు దురంధర్ సక్సెస్ తో దేశమంతటా మార్మోగుతున్న ఆదిత్య ధర్ గతంలో చాలానే ఇబ్బందులు పడ్డారనేది వాస్తవం.
