రణ్‌వీర్ సింగ్‌పై ఇండస్ట్రీ లాబీయింగ్: బాలీవుడ్ వివాదం వెనుక అసలు కథ ఇదేనా?
బాలీవుడ్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో వరుస వివాదాలు పరిశ్రమ ప్రగతికి పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి.
By: Sivaji Kontham | 2 Jun 2026 2:00 PM ISTబాలీవుడ్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో వరుస వివాదాలు పరిశ్రమ ప్రగతికి పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నటుడు రణ్‌వీర్ సింగ్ చుట్టూ నడుస్తున్న వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణ్‌వీర్ సింగ్‌పై విధించిన నిషేధం పరిశ్రమలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ వివాదం వెనుక కేవలం రణ్‌వీర్ మాత్రమే లేడని... అసలు టార్గెట్ దర్శకుడు ఆదిత్య ధర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక బలమైన టాక్ నడుస్తోంది. సాంప్రదాయ బాలీవుడ్ ఎకో-సిస్టమ్ దశాబ్దాలుగా నమ్ముతున్న సిద్ధాంతాలను, నెరేటివ్‌లను ఆదిత్య ధర్ తన సినిమాలతో తప్పుగా నిరూపిస్తున్నాడని.... అందుకే సదరు లాబీ అంతా ఆయనను చూసి భయపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు `గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్` ఎడిటర్ అభిప్రాయపడినట్లుగా.. ఇదంతా రణ్‌వీర్ సింగ్‌ను కావాలనే టార్గెట్ చేస్తూ `సెలెక్టివ్ ఔట్‌రేజ్` (ఎంపిక చేసి టార్గెట్ చేయడం) అనే కోణం కూడా వినిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ప్రెసిడెంట్, సీనియర్ నటి పూనమ్ ధిల్లాన్ స్పందించారు. FWICE రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించడాన్ని ప్రశ్నిస్తూ.. ఇది ఎంతో వింతైనదిగా అభివర్ణించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నటుడు రణ్‌వీర్ తమ అసోసియేషన్ వద్దకు వచ్చి మద్దతు కోరి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలోని ఒక బలమైన లాబీ గ్రూపు, మరో శక్తివంతమైన లాబీ గ్రూపును అణచివేయడానికి చూస్తోందని... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా వికారంగా ఉన్నాయని పూనమ్ ధిల్లాన్ పేర్కొన్నారు. ఈ వివాదంపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శోభా డే కూడా తన గళాన్ని విప్పారు. వినోద పరిశ్రమ విషయానికి వస్తే అక్కడ ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలకు చోటు ఉండకూడదని ఆమె బలంగా వాదించారు. ఇది కేవలం ఒక స్టార్ హీరో కెరీర్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదని, దీని వెనుక ఎంతోమంది టెక్నీషియన్లు, ఇతర కార్మికులతో కూడిన ఒక సబ్-ఇండస్ట్రీ దాగి ఉందని గుర్తుచేశారు. ఇండస్ట్రీలో విధిస్తున్న ఇలాంటి సో-కాల్డ్ బ్యాన్లు (నిషేధాలు) లేదా సహకరించబోమనే మొండి వైఖరుల వల్ల కేవలం నటులే కాకుండా, ఆయా సినిమాలపై ఆధారపడి బతుకుతున్న సాధారణ టెక్నీషియన్లు, రోజువారీ కార్మికులు చాలా దారుణంగా దెబ్బతింటారని శోభా డే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదాల నడుమ తాజాగా తెరపైకి వచ్చిన 'డాన్ 3' వివాదం ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని వైపుల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిందీ సినిమాలో పలు క్రేజీ ప్రాజెక్టులు తాత్కాలికంగా నిలిచిపోయిన తరుణంలో.. రణ్‌వీర్ సింగ్‌పై విధించిన ఈ నిషేధాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రణ్ వీర్ పై ఒక అసోసియేషన్ దాష్టీకం కారణంగా నష్టం అతడికి కాదు. సినీకార్మికులు, సాంకేతిక నిపుణులకు తీరని నష్టం వాటిల్లుతుంది. వారంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఇతర హీరోలకు లేదా టెక్నీషియన్లకు కూడా దాపురించవచ్చని చాలా మంది భయపడుతున్నారు. అందుకే సదరు సంఘం కారణంగా నష్టపోకుండా ముందే న్యాయపరమైన మార్గాల గురించి పలువురు నిర్మాతలు, నటులు వేటను మొదలు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పరిశ్రమకు చెందిన కొందరు అగ్ర సెలబ్రిటీలు ఈ వివాదంలో జోక్యం చేసుకుని, కోర్టు వెలుపలే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి గట్టిగా చర్చలు జరుపుతున్నారు. మరికొందరు మాత్రం రణ్‌వీర్ సింగ్‌కు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు వర్గాల నుండి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నందున... ఈ ఇష్యూలో అసలు ఎవరు రైట్ అనేది తేల్చడం కష్టంగా మారింది. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ `డాన్ 3` కోసం చాలా కాలం పాటు శ్రమించినందున అతడు ఇంత కఠినంగా వ్యవహరించడం ఎంత సహజమో.. ధురంధర్ సూపర్ సక్సెస్ తర్వాత రణ్‌వీర్ సింగ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంలోనూ అర్థం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా బాలీవుడ్ వీలైనంత త్వరగా ఈ వివాదానికి స్వస్తి పలకాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ ఇష్యూని పరిష్కరించేందుకు అక్కడ కూడా ఒక మెగాస్టార్ ప్రయత్నాల్లో ఉన్నారని ఇటీవల గుసగుసలు వినిపించాయి. అయితే ఎవరి మంత్రాంగం ఫలించి సమస్య పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.
సినిమా రంగంలో అంతర్గతంగా నడిచే లాబీ గ్రూపుల స్వార్థ రాజకీయాల వల్ల అంతిమంగా నష్టపోయేది సినిమాను నమ్ముకున్న శ్రామికులేనని ఈ వివాదం మరోసారి నిరూపిస్తోంది. ఒకవైపు టార్గెట్ పాలిటిక్స్... మరోవైపు పరిశ్రమ పెద్దల అభ్యంతరాల నడుమ రణ్‌వీర్ సింగ్ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
