400 మంది స్టంట్ మ్యాన్లతో సృష్టించిన అద్భుతం!
పాన్ ఇండియాను షేక్ చేసిన `ధురంధర` చిత్రానికి సంబంధించి దర్శకుడు ఆదిత్య ధర్ తెర వెనుక చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
By: Srikanth Kontham | 16 April 2026 9:12 AM ISTపాన్ ఇండియాను షేక్ చేసిన 'ధురంధర్' చిత్రానికి సంబంధించి దర్శకుడు ఆదిత్య ధర్ తెర వెనుక చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాల వెనుక ఎంతటి శ్రమ, ప్రణాళిక ఉన్నాయో? ఆదిత్య ధర్ వివరించారు. నమ్మకానికి- అప నమ్మకానికి మధ్య ఉండే సన్నని గీతను ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రతిరోజూ దాటానని పేర్కొనడం తో సినిమా కోసం ఆయన ఎంతగా శ్రమించారు అన్నది అద్దం పడుతుంది. ఈ చిత్రంలోని భారీ యాక్షన్ ఘట్టాల కోసం ఏకంగా 400 మందికి పైగా స్టంట్ మాస్టర్లు పనిచేసినట్లు ఆదిత్య ధర్ వెల్లడించారు.
'ఒకానొక దశలో షూటింగ్‌లో నాకు పాత ముఖాలే కనిపిస్తున్నాయి. కొత్తవారు ఎవరూ లేరా? అని ఆయన తన బృందాన్ని అడగ్గా 'ముంబైలో ఉన్న స్టంట్ మ్యాన్లందరినీ ఇప్పటికే వాడేశాం. ఇక ఎవరూ మిగిలిలేరదు` అని సమాధానం వచ్చిందట. ఈ స్థాయి మ్యాన్‌పవర్ వినియోగం చలనచిత్ర చరిత్రలో అరుదైన విషయంగా నిలిచిపోతుంది. ఆదిత్య ధర్ తన యాక్షన్ టీమ్‌కు కొన్ని క్రేజీ ఐడియాలను ఇచ్చేవారట. ఇండస్ట్రియల్ ప్రెషర్ కుక్కర్‌లో ఒక మనిషిని ఉడికించడం. ఒక వ్యక్తిని బైక్ వెనుక కట్టి రద్దీగా ఉండే వీధుల్లో ఈడ్చుకెళ్లడం.
ముప్పై మందిని ఫ్యాన్లకు తలకిందులుగా వేలాడదీయడం వంటి అత్యంత సాహసోపేతమైన సీక్వెన్సులను ఆదిత్య ధర్ ఐడియా నుంచి పుట్టినవేనట. ఇవి చెప్పేటప్పుడు తనకే అసాధ్యమని అనిపించినా? స్టంట్ మాస్టర్లు అజాజ్ గులాబ్, యానిక్ బెన్ వంటి నిపుణులు వాటిని వాస్తవ రూపంలోకి అద్భుతంగా తీసుకొచ్చారన్నారు. యాక్షన్ అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు. ప్రేక్షకుడికి ఒక రకమైన మ్యాడ్‌నెస్ అనుభూతిని ఇవ్వాలని సినిమా కోసం కొత్త తరహా కొరియోగ్రఫీని రూపొందించారు. గ్యాంగ్ వార్స్, భారీ పేలుళ్లు వంటి సన్నివేశాల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కచ్చితత్వంతో వాటిని పూర్తి చేశారు.
రణవీర్ సింగ్ ఈ సన్నివేశాల కోసం పడరాని పాట్లు పడ్డారన్నారు. దర్శకుడి విజన్‌ను తెరపైకి తీసుకురావడంలో సాంకేతిక నిపుణుల పాత్ర వెలకట్టలేనిదని ఆదిత్య ధర్ కొనియాడారు. అద్భుతమైన సాంకేతిక విలువల ఫలితంగా `ధురంధర్` ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద 3000 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్‌లో భారీ యాక్షన్ చిత్రాలను ఎలా రూపొందించాలో ? ఈ సినిమా ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఆదిత్య ధర్ చూపించిన తెగింపు, సృజనాత్మకత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
మొత్తానికి `ధురంధర్` వసూళ్లలోనే కాదు. తెరవెనుక జరిగిన కృషి కూడా విప్లవంలా నిలిచింది. ఆదిత్య ధర్- ఆయన బృందం పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అసాధ్యమనుకున్న సన్నివేశాలను సుసాధ్యం చేస్తూ రూపొందిన చిత్రం యాక్షన్ జోనర్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఆదిత్య ధర్ తన సిగ్నేచర్ స్టైల్‌తో మరోసారి ప్రతిభను చాటుకున్నారు.
