రెండేళ్ల వరకూ కెప్టెన్ కుర్చీకి దూరంగా!
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తదుపరి మెగా ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By: Srikanth Kontham | 13 April 2026 7:00 AM ISTబాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తదుపరి మెగా ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ`ను పట్టాలెక్కించడానికి మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించుకున్నారట. ఈ భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసమే ఆయన కనీసం రెండేళ్ల సమయం కేటాయించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండేళ్ల కాలం ఆయన మెగా ఫోన్ పట్టకుండా కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి `అశ్వత్థామ` ప్రాజెక్ట్ గత కొన్నేళ్లుగా వార్తల్లో ఉన్నదే. మొదట విక్కీ కౌశల్‌తో హీరోగా తెరకెక్కిం చాలను కున్నారు. కానీ బడ్జెట్ సహా ఇతర సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే ఆదిత్యధర్ ఈ కథపై ఉన్న నమ్మకంతో వదులుకోకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని పట్టుదలతో ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్ కోసమే విదేశీ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు ప్లానింగ్ పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టేలా ఉంది.
ఈ రెండేళ్ల విరామంలో ఆదిత్య ధర్ కేవలం స్క్రిప్ట్ వర్క్ , విజువలైజేషన్‌పైనే దృష్టి పెట్టనున్నారు. మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఆధునిక కాలానికి అన్వయిస్తూ తీయబోతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తొందరపడకుండా, ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మేకింగ్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే సుదీర్ఘ విరామం తీసుకుంటు న్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వానికి దూరంగా ఉన్నా? నిర్మాతగా మాత్రం బిజీగా ఉండే అవకాశం ఉంది. తన నిర్మాణ సంస్థ ద్వారా చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తూనే అశ్వత్థామకు కావాల్సిన భారీ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయని ఒక పాన్ ఇండియా స్టార్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.
మొత్తానికి ఆదిత్య ధర్ కెప్టెన్ కుర్చీకి తాత్కాలికంగా దూరమైనా? ఆయన తిరిగి వచ్చేది మాత్రం ఒక వెండితెర అద్భుతంతోనే అని అభిమానులు నమ్ముతున్నారు. `ఉరి, `ధురందర్` వంటి చిత్రాలతో సత్తా చాటిన ఆయన `అశ్వత్థామ`తో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండేళ్ల తర్వాత మొదలయ్యే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
