భర్త- అత్త ఆడపడుచులపై సీరియల్ నటి గృహహింస- వేధింపుల కేసు
గడిచిన ఏడాది కాలంగా పలువురు నటీమణులు భర్తల నుంచి విడాకులు తీసుకున్న విషయాలు అభిమానులను కలచి వేసిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Aug 2026 11:11 AM ISTభర్త, అత్తమామలు, ఆడపడుచులు తనను తీవ్రంగా వేధించారని ఆరోపిస్తూ ప్రముఖ టెలివిజన్ నటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అత్త ఇంట్లో చిన్న గొడవ కాస్తా చినికి చినికి గాలివాన అయిందని, దానికి ముందు తమ ఇంట్లో పెద్ద గొడవలే అయ్యాయని పీఎస్ లో పోలీసులకు విన్నవించారు సదరు టీవీ నటీమణి.
అంతేకాదు.. ఇదంతా తన భర్త చేతకానితనం అంటూ ఆరోపించారు. ఇంటి ఖర్చులను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇంటికి ఇవ్వకపోగా.. తన నుంచే డబ్బులు గుంజేవాడని ఆరోపించారు. 1 జనవరి 2025న కాఫీ విషయమై జరిగిన చిన్న వివాదం కాస్త పెద్దదై తీవ్రమైన బూతులు తిట్టే వరకు వెళ్లిందని తెలిపారు. ఆ సంఘటన తర్వాత భర్త తన ప్రవర్తనను శంకించడం.. అక్రమ సంబంధాలు అంటగట్టడం.. ఫోన్‌ను పదే పదే చెక్ చేయడం.. వేరే గదిలో పడుకోవడం ప్రారంభించాడని... చివరికి తన కన్నతల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా నిరోధించాడని సదరు నటి కం కోడలు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తన స్త్రీధనం కింద వచ్చిన పెళ్లి బంగారు ఆభరణాలలో బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులు అత్తగారు తన వద్దే ఉంచుకుని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని టీవీ నటి తీవ్ర ఆరోపణలు చేశారు. గొడవలు సద్ధుమణుగయ్యేలా చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అత్త, ఆడపడుచులు భర్తకే సపోర్ట్ చేస్తూ తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన అదితి శర్మ తన భర్త - అత్తగారి కుటుంబంపై గృహహింస, శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలతో ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
మనస్ఫర్థలతో భర్త నుంచి విడిపోయిన కథానాయికలు:
గడిచిన ఏడాది కాలంగా పలువురు నటీమణులు భర్తల నుంచి విడాకులు తీసుకున్న విషయాలు అభిమానులను కలచి వేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ లు హన్సిక, మౌని రాయ్ ఇప్పటికే తమ భర్తల నుంచి పరస్పర అంగీకారంతో విడిపోయారు. అదే క్రమంలో తమ గోప్యతను కాపాడాల్సిందిగా కోరారు. అలాగే క్రికెటర్ లు చాహల్, హార్థిక్ పాండ్యా ల నుంచి నటీమణులు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. చాహల్ భార్య ధనశ్రీ వర్మ, పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ గతంలో భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం నటి సమంత తన భర్త నుంచి విడాకులు తీసుకోగా దానిపై అభిమానులు కలతకు గురైన సంగతి తెలిసిందే. సెలబ్రిటీ ప్రపంచంలో ఇది నిత్యకృత్యంగా మారింది.
టీవీ రంగంలో తీవ్ర ఆరోపణలతో విడిపోయిన నటీమణుల గురించి..
బుల్లితెరపై నటీమణులుగా, యాంకర్లుగా ఎంతో ప్రజాదరణ పొంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పలువురు నటీమణులు తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సీరియళ్లు, షోలలో తమ నటనతో అలరించే ఈ నటీమణులలో కొందరు భర్తలతో వచ్చిన తీవ్ర మనస్పర్థలు, భావసారూప్యత లోపించడం.. ఇతర వ్యక్తిగత కారణాల వల్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్నారు. శ్వేతా తివారీ, రష్మి దేశాయ్, కామ్యా పంజాబీ, జెస్సికా రాజ్‌పుత్ వంటి హిందీ బుల్లితెర ప్రముఖులతో పాటు తెలుగులోనూ సీనియర్ యాంకర్లు, నటీమణులు తమ పెళ్లి బంధం నుంచి విడిపోయారు. వైవాహిక జీవితంలో విఫలమైనా.. ఈ ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా వారు తమ సొంత కాళ్లపై నిలబడి, సింగిల్ మదర్స్‌గా పిల్లల బాధ్యతలను నెరవేరుస్తూ... తిరిగి కెరీర్‌పై దృష్టి సారించి ఆధునిక మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
