కుటుంబాలు ఎలా ఉండకూడదో చెప్పిన స్టార్ హీరో వైఫ్!
కుటుంబ బంధాలు బలంగా ఉండాలంటే కలిసి నవ్వుకోవడం, భోజనం చేయడం ఎంతో ముఖ్యమని హీరోయిన్ అదితి రావు హైదరీ చెప్పారు. భర్త సిద్ధార్థ్ కుటుంబంతో పాటు తన కుటుంబంలోనూ ఈ సంప్రదాయం ఉందని తెలిపారు. కష్ట సమయాల్లోనూ నవ్వుతూ ఉండటం, ఆహారాన్ని పంచుకోవడం బంధాలను మరింత బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు.
By: Sivaji Kontham | 14 Nov 2026 9:10 AM ISTనేటి కుటుంబ వ్యవస్థలో వచ్చిన చాలా మార్పులు మానసిక అశాంతికి, చివరికి కలతలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. జంటలు బ్రేకప్ అవ్వడానికి వారి మధ్య సరైన బాంధవ్యం లేకపోవడమేనని కౌన్సిలర్లు చెబుతున్నారు. పెద్ద కుటుంబాల విభజన కూడా దీనికి ఒక కారణం. కుటుంబంలో పది మంది ఒక చోట ఆనందంగా జీవించడం.. కుటుంబ పెద్ద చెప్పిన దానిని తూ.చ తప్పక అనుసరించడం వంటి చాలా విషయాలు ఈరోజుల్లో లేవు. జెన్ జి పెద్దల మాటను పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణ ఉంది.
అయితే వీటన్నిటి నుంచి బయటపడేందుకు తాము అనుసరిస్తున్న ఒక విధానం గురించి స్టార్ హీరో సిద్ధార్థ్ సతీమణి, మేటి కథానాయిక అతిదీరావ్ హైదరీ చెప్పుకొచ్చిన విషయాలు ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా తన కుటుంబంలో.. తన భర్త సిద్ధార్థ్ కుటుంబంలో ప్రత్యేక విలువలు, సంప్రదాయాల గురించి మనసు విప్పి మాట్లాడారు. కలిసి నవ్వుకోవడం.. కలిసి భోజనం చేయడం వంటి చిన్నచిన్న రోజువారీ సంగతులు కుటుంబ సభ్యులను ఎలా దగ్గర చేస్తాయో.. అందరం ఒక్కటే అనే భావనను ఎలా కలిగిస్తాయో అదితీ వివరించారు.
తమ ఇంట్లో ఎప్పుడూ ఏ ఇద్దరు ఎదురు పడినా, కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలిసినా నవ్వుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను వెతుకుతామని అన్నారు. సిధ్ కుటుంబం అయినా.. తన కుటుంబీకులు అయినా.. మేమంతా ఒకరికొకరం కలుసుకున్నప్పుడు చక్కని హాస్య చతురతతో నవ్వుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇరు కుటుంబాల్లోనూ ఉన్న ఒక ఉమ్మడి సంప్రదాయం ఇది అని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ కలిసి నవ్వుకోవడానికి ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటారని అదితి వెల్లడించారు. ఏం జరిగినా సరే.. నవ్వుకోవడానికి ఏదో ఒక విషయాన్ని వెతుక్కోవడం నాకు చాలా ఇష్టం అని అన్నారు. కుటుంబాలు కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు హాస్యచతురతను కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో కూడా ఏదో ఒక సానుకూల అంశాన్ని గుర్తించగలగడం వల్ల వ్యక్తుల మధ్య అనుబంధం నిలిచి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏం జరిగినా చిరునవ్వుతో ఉండాలి.. మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి! అని ఒక అద్భుతమైన ఫార్ములాను నేటి కుటుంబ వ్యవస్థ కోసం తెలియజేసారు అదితీరావ్ హైదరీ.
అంతేకాదు.. ఇంటిల్లిపాదీ ఓచోట కూచుని భోజనం చేయడం.. రక్తసంబంధం లేని వ్యక్తుల మధ్య కూడా కలిసి కూర్చుని భోజనం చేయడం వల్ల ఒక ఆత్మీయ భావన ఏర్పడుతుందని అదితీ హైలైట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఇరుగుపొరుగు కూడా ఒక కుటుంబంగా మారిపోతుంది. ఇది ముమ్మాటికీ నిజం. కలిసి తినడం.. ఆహారం షేర్ చేసుకోవడం కూడా బంధాల్ని మరింత బలపరుస్తుందని తెలిపారు. కుటుంబం అంటే కేవలం రక్తసంబంధాలకు మాత్రమే పరిమితం కాదని.. ఒకరితో ఒకరు షేర్ చేసుకునే అనుభవాలు, ఆప్యాయత, సాంగత్యంతో కుటుంబ బంధలు మరింత పెరుగుతాయని విశ్లేషించారు. అదితీ చెప్పిన టిప్ ని భారతదేశంలోని అన్ని కుటుంబాలు అనుసరిస్తే మంచిదే!
అదితీరావ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... పెళ్లి తర్వాత బిజీ నటిగా కొనసాగుతున్నారు. తన తదుపరి చిత్రం `పారివారిక్ మనోరంజన్` సోనీలివ్ లో స్ట్రీమ్ అవుతోంది. వరుణ్ వి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సునీతా రాజ్‌వార్, బ్రిజేంద్ర కాలా, ముఖేష్ తివారీ కీలక పాత్రల్లో నటించారు.
