శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ నటి కామెంట్.. ఆడవాళ్ళ డ్రెస్సే సమస్య అయితే!
హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ ఒకపెద్ద చర్చకు దారితీశాయి.
By: Madhu Reddy | 26 Feb 2026 10:44 PM ISTహీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ ఒకపెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై నటి అదితి మ్యాకల్ తనదైన శైలిలో స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆడవాళ్ల బట్టలే సమస్య అయితే, తాను ఒళ్లంతా కప్పేసే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా వేధింపులు ఎందుకు ఎదురయ్యాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేవలం డ్రెస్సింగ్‌ను సాకుగా చూపి మగవారి ప్రవర్తనను సమర్థించడం కరెక్ట్ కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.
ఈ డ్రెస్సింగ్ సాకుగా చెప్పొద్దు.. అదితి మ్యాకల్ కౌంటర్:
నటుడు శివాజీ గత ఏడాది ఆఖరిలో ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలపై అదితి మ్యాకల్ ఘాటుగా స్పందించారు. శివాజీ నటించిన పాత సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్ దుస్తులు వేసుకున్నప్పుడు ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆమె ప్రశ్నించారు. ఇక అప్పట్లో ఆ సినిమాలు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తోందని నిలదీశారు. మహిళల దుస్తులే సమస్య అని చెప్పడం వెనుక ఉన్న లాజిక్‌ను ఆమె తప్పుబట్టారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నది అదితి ఉద్దేశం.
ఫుల్ డ్రెస్ వేసుకున్నా వేధింపులు తప్పలేదు:
తమపై జరిగే అటాక్స్‌కు మహిళల దుస్తులే కారణమనే వాదనను అదితి తన సొంత అనుభవంతో తిప్పికొట్టారు. "నేను ఒకసారి ఒళ్లంతా కప్పేసేలా ఫుల్ డ్రెస్ వేసుకుని బస్సు ఎక్కాను. అయినా సరే ఒక వ్యక్తి నా ఛాతీని తాకాడు. మరి అప్పుడు నా డ్రెస్సింగ్‌లో లోపం ఎక్కడ ఉంది?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడే వ్యక్తి బుద్ధిలో లోపం ఉందే తప్ప, ఆడవాళ్లు వేసుకునే బట్టల్లో కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. ముసుగు వేసుకున్నా, మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా వికృత చేష్టలు చేసేవారు చేస్తూనే ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.
ఆలోచనా విధానం మారాలి.. కేవలం బట్టలు కాదు:
అమీతుమీ, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అదితి, సమాజంలో ఉన్న నమ్మకద్రోహం ఎండగట్టారు. ఒక మనిషి ప్రవర్తనను వారి బట్టలతో ముడిపెట్టడం మానేసి, ఎదుటివారిని చూసే చూపులో మార్పు రావాలని ఆమె కోరారు.ఇక కేవలం హీరోయిన్లనే కాకుండా ప్రతి మహిళా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటూనే ఉందని గుర్తు చేశారు. శివాజీ లాంటి సీనియర్ నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
