Begin typing your search above and press return to search.

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం పార్ట్-1’ విజువల్స్‌పై ప్రశంసలు వస్తుండటంతో దర్శకుడు ఓం రౌత్‌పై ప్రభాస్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో ఆయన రూపొందించిన ‘ఆదిపురుష్’లో రామాయణాన్ని తెరకెక్కించిన తీరును తప్పుబడుతున్నారు. వానరులను గొరిల్లాలుగా చూపించడం, గ్రాఫిక్స్, శ్రీరాముడి పాత్ర చిత్రణలో లోపాలు ఉన్నాయని మండిపడుతున్నారు. ‘రామాయణం’ చూస్తుంటే ‘ఆదిపురుష్’లో జరిగిన తప్పులు గుర్తొస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   7 Nov 2026 9:33 AM IST
ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్
X

నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన `రామాయణం పార్ట్-1` ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజువల్ గ్రాండియారిటీ ప‌రంగా మెప్పు పొందిన సంగ‌తి తెలిసిందే. ఎమోష‌న్స్ మిస్స‌య్యాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా సాంకేతికంగా అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ త‌రుణంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌పై నెటిజన్లు- ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శల దాడికి తెర తీసారు. రామాయణాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో..సనాతన సాంప్రదాయాల శోభ చెడకుండా ఎలా తెరకెక్కించ వచ్చో నితీష్ తివారీ నిరూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో గతంలో శ్రీరాముడి కథాంశంతో ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ రూపొందించిన `ఆదిపురుష్` విఫలమైన తీరును గుర్తుచేస్తూ ఫ్యాన్స్ మీడియా ఎదుట‌ విరుచుకు పడుతున్నారు.

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఓం రౌత్ `ఆదిపురుష్` రూపంలో దెబ్బతీశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కించే సమయంలో ప్రజల విశ్వాసాలను, ఆలోచనా విధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవిత్రమైన రామాయణంలో వానరాలకు బదులుగా గొరిల్లాలను చూపించడం.. హాలీవుడ్ స్టైల్ డార్క్ షేడ్స్‌ను అనుకరించడం వంటి నిర్ణయాలు సినిమా ఆత్మను దెబ్బతీశాయని వారు ప్రధానంగా వేలెత్తి చూపుతున్నారు. `రామాయణం`లాంటి ఒక నిజమైన విజువల్ గ్రాండియర్ కాన్సెప్టులో ప్రభాస్ నటించి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అంతేకాకుండా శ్రీరాముడిగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడంలో ఓం రౌత్ పూర్తిగా విఫలమయ్యారనేది నెటిజన్ల అభిప్రాయం. అంతటి విగ్రహపుష్టి, గాంభీర్యం ఉన్న నటుడిని సరిగ్గా ఉపయోగించు కోకుండా విజువల్ ఎఫెక్ట్స్- గ్రాఫిక్స్ పేరుతో ప్రభాస్ ఇమేజ్‌ను తగ్గించేశారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో కనిపించిన సాంకేతిక పరిణతిని చూసిన ఫ్యాన్స్.. ఆదిపురుష్ చిత్రంలో జరిగిన సాంకేతిక లోపాలను.. రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించిన తీరును తలచుకుంటూ మీడియా - సోషల్ మీడియా వేదికలలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న ఘోర పరాజయం.. ఎదుర్కొన్న‌ ప్రతికూల విమర్శల దెబ్బ నుంచి దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేక పోయారనేది చిత్ర పరిశ్రమలో చ‌ర్చ‌. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో మరే పెద్ద ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కకపోవడం లేదా విడుదల కాకపోవడం గమనార్హం. ధనుష్ కథానాయకుడిగా భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన `కలామ్: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా` బయోపిక్‌కు మాత్రమే ఆయన దర్శకత్వం వహించ‌గా.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఊహించ‌ని రీతిలో `ఆదిపురుష్` ఇచ్చిన భారీ షాక్ నుంచి ఓం రౌత్ కెరీర్ ఇప్పటికీ కోలుకోలేకపోవడమే కాకుండా... రామాయణ ఆధారిత కొత్త సినిమాలు వచ్చిన ప్రతిసారీ అత‌డు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి. ఒక గొప్ప పౌరాణిక కథను సరైన విజువల్ విజన్‌తో తెరకెక్కించక పోతే ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పడానికి `ఆదిపురుష్` ఒక ఉదాహరణగా నిలవగా.. `రామాయణం` వంటి చిత్రాలు విజువల్ స్టాండర్డ్స్‌కు కొత్త కొలమానాలను నిర్దేశిస్తున్నాయనే చ‌ర్చ సాగుతోంది.