Begin typing your search above and press return to search.

పోలికల సెగ.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు నిజమేనా?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న 'ఆదర్శ కుటుంబం హెచ్ నెం 47' (AK47) షెడ్యూల్ మారబోతున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   3 Jun 2026 10:00 PM IST
పోలికల సెగ.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు నిజమేనా?
X

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న 'ఆదర్శ కుటుంబం హెచ్ నెం 47' (AK47) షెడ్యూల్ మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'బ్లాస్ట్ జోన్' సినిమా కథాంశం దీనికి కాస్త దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమని టాక్. తమ సినిమా లైన్ కు పోలికలు రాకుండా ఉండేందుకు త్రివిక్రమ్ ఇప్పుడు స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనివల్ల ముందుగా అనుకున్న దీపావళి రిలీజ్ ప్లాన్ మారి, సినిమా డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఫ్యామిలీ సమస్యల్లో పడటం, ఆ తర్వాత తెలివిగా లా అండ్ ఆర్డర్ నుంచి తప్పించుకోవడం అనే పాయింట్ మనకు 'దృశ్యం' సిరీస్ లో కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన బ్లాస్ట్ జోన్ లో కూడా తండ్రి, కూతురు చుట్టూ తిరిగే ఇలాంటి కథే ఉంది, కాకపోతే దానికి కరాటే బ్యాక్ డ్రాప్ తో కాస్త యాక్షన్ టచ్ ఇచ్చారు.

ఇప్పుడు వెంకటేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా ఒక డాన్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఒక ఫారిన్ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. రెండు సినిమాల సోల్ ఒకేలా అనిపించే ప్రమాదం ఉండటంతోనే రైటింగ్ టేబుల్ పై త్రివిక్రమ్ మళ్లీ కసరత్తులు మొదలుపెట్టారట. గతంలో ఒక భాషలో వచ్చిన సినిమా పాయింట్ ను మరో భాషలోకి మార్చి తీసినప్పుడు ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడున్న ఓటీటీ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఏ సిరీస్ వచ్చినా జనాలు ఇట్టే చూసేస్తున్నారు.

అందుకే ఇన్స్ పిరేషన్ పేరుతో ఎలాంటి చిన్న ప్రయత్నం చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో ఒరిజినల్ సోర్స్ ను బయటపెడుతున్నారు. గతంలో త్రివిక్రమ్ చేసిన 'అజ్ఞాతవాసి' విషయంలో కూడా ఫ్రెంచ్ సినిమా పోలికలు రావడం వలన ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలిసిందే. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి మేకర్స్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ తరహా కథల్లో వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక సమస్యను ఎలా డీల్ చేసిందనే డ్రామాను త్రివిక్రమ్ తనదైన స్టైల్ డైలాగ్స్ తో నడపగలడు.

కాకపోతే ఒకే తరహా జోనర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తే థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కు ఆ ఫీల్ కొత్తగా అనిపించదు. అందుకే యాక్షన్ ఎపిసోడ్స్ లేదా క్యారెక్టరైజేషన్స్ లో మార్పులు చేసి పూర్తిగా ఒక కొత్త ప్రెజంటేషన్ తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. స్క్రిప్ట్ పక్కాగా ఉంటేనే సెట్స్ పైకి వెళ్లాలనే త్రివిక్రమ్ నిర్ణయం వల్లే షూటింగ్ లో కాస్త జాప్యం జరుగుతోంది. రిలీజ్ డేట్ మారడం అనేది ఒక రకంగా బిజినెస్ పరంగా కూడా సేఫ్ డెసిషనే అని చెప్పాలి. దీపావళి రేసు కంటే డిసెంబర్ ఎండ్ లేదా సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.