Begin typing your search above and press return to search.

ఆదర్శ కుటుంబం కష్టాలకు అంతే లేదు

మేకింగ్ దశలో ఉండగా.. వేరే సినిమాలతో పోలికల వల్ల స్క్రిప్టు మారుస్తున్నారని, రీషూట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

By:  Garuda Media   |   30 Oct 2026 10:09 AM IST
ఆదర్శ కుటుంబం కష్టాలకు అంతే లేదు
X

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. దశాబ్దం కిందటే రావాల్సిన సినిమా కాస్తా.. రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయి గత ఏడాది పట్టాలెక్కింది. దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. కానీ ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.

మేకింగ్ దశలో ఉండగా.. వేరే సినిమాలతో పోలికల వల్ల స్క్రిప్టు మారుస్తున్నారని, రీషూట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ షూటింగ్ అనుకున్న దాని కంటే బాగా ఆలస్యం అయింది. తర్వాతేమో ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చాక రెండుసార్లు మార్చాల్సి వచ్చింది. మరోవైపు ఈ సినిమా ప్రోమోలు, పాటల విషయంలో ప్రేక్షకుల నుంచి బాగా విమర్శలు వచ్చాయి. రిలీజ్ ముంగిట సినిమాకు ఆశించిన హైప్ కనిపించలేదు.

ఇవన్నీ చాలవన్నట్లు రిలీజ్ ముంగిట అనుకోని అవాంతరాలు తప్పట్లేదు. ‘ఆదర్శ కుటుంబం’ ఇంకొక్క రోజులో రిలీజ్ కాబోతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. అర్నాబ్ తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలం అయ్యాయి. పంటలతో పాటు ఆస్తి నష్టం వాటిల్లి జనాలు తీవ్ర శోకంలో మునిగిపోయి ఉన్నారు. రెగ్యులర్‌గా సినిమాలు చూసే వాళ్లలో చాలామంది ఇప్పుడు థియేటర్‌కు వచ్చే మూడ్‌లో లేరు. ఇంకోవైపు ఈ సినిమాకు ఏపీలో టికెట్ల ధరలు పెంచడం కూడా ప్రతికూలంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రెండు చోట్లా ‘ఆదర్శ కుటుంబం’కు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్లుగా ఉన్నాయి. మామూలుగా అయితే వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా అంటే జనాలు ఎగబడి టికెట్లు కొనాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఐతే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా కనిపిస్తున్న నేపథ్యంలో టాక్ బాగుంటే.. ఆటోమేటిగ్గా ఆడియన్స్ థియేటర్లకు వస్తారని టీం ఆశిస్తోంది. కాబట్టి ‘ఆదర్శ కుటుంబం’కు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం.