Begin typing your search above and press return to search.

హీరోయిన్లు మాత్రమే కాదు.. అందరూ బాధ్యులే! పెద్ది వివాదంపై అదా శర్మ

అయితే పాత్రల ఎంపిక, స్టోరీ సెలెక్ష‌న్ విషయంలో నటీనటులు ఎంత బాధ్యతగా ఉండాలనే అంశంపై అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Jun 2026 1:09 PM IST
హీరోయిన్లు మాత్రమే కాదు.. అందరూ బాధ్యులే! పెద్ది వివాదంపై అదా శర్మ
X

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పెద్ది ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ, రిలీజ్ త‌ర్వాత కొన్ని సీన్స్ కారణంగా వివాదాల్లోనూ నిలిచింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ క్యారెక్ట‌ర్ ను సినిమాలో చూపించిన తీరు మహిళలను అభ్యంతరకరంగా చూపించిందనే విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పడమే కాకుండా, వివాదాస్పద సన్నివేశాలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి అదా శర్మ తాజాగా ఈ వివాదంపై స్పందించిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తన కొత్త సినిమా గవర్నర్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన అదా శర్మను, జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ నెలకొన్న వివాదం గురించి ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై నేరుగా వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. తాను పెద్ది సినిమాలో నటించలేద‌ని, ఇంకా ఆ సినిమాను కూడా చూడలేద‌ని, కాబట్టి ఆ సినిమాలోని సీన్స్ లేదా క్యారెక్ట‌ర్ గురించి తాను మాట్లాడ‌టం స‌రైన‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, తాను ఇండస్ట్రీకి బయటి వ్యక్తిగా వచ్చినందున తన ప్రయాణం, తన అనుభవాలు పరిశ్రమలో జన్మించిన లేదా పెరిగిన వారి అనుభవాల కంటే భిన్నంగా ఉంటాయని, అందుకే ఈ విషయంలో తన కామెంట్ సరైన సందర్భంలో ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

అయితే పాత్రల ఎంపిక, స్టోరీ సెలెక్ష‌న్ విషయంలో నటీనటులు ఎంత బాధ్యతగా ఉండాలనే అంశంపై అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం నటీమణులు మాత్రమే కాదు, నటులు, దర్శకులు, రచయితలు, చివరకు సినిమాలో విగ్గులు లేదా నకిలీ మీసాలు ఎంపిక చేసే వ్యక్తి కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల‌ని, ఒక తప్పు నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం చాలా పెద్దదిగా మారుతుంద‌ని, కొన్నిసార్లు మొత్తం దేశం కూడా ఆ త‌ప్పు తాలూకా ఫలితాలను అనుభవించాల్సి వస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు.

సినిమాల్లో మార్పు ఒక్కసారిగా రాదని, అది క్రమంగా జరిగే ప్రక్రియ అని అదా అభిప్రాయపడ్డారు. కూరగాయలు తింటే వెంటనే ఫలితం కనిపించదు. కానీ కొంతకాలం తర్వాత ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంద‌ని, అలాగే సినిమాల్లో కూడా మంచి పాత్రలు, సమతుల్యమైన కథనాలు వస్తూ ఉంటే ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు వస్తుంద‌ని ఆమె వివరించారు. మహిళా పాత్రలను ఒకే కోణంలో చూపించడం కంటే, నిజ జీవితంలో మహిళలు ధైర్యవంతులు, తెలివైనవారు, హాస్యభరితులు, భావోద్వేగాలతో నిండినవారు అనే విభిన్న కోణాలను ప్రతిబింబించే పాత్రలు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ పెద్ది బాక్సాఫీస్ వద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రామ్ చరణ్ కెరీర్‌లో మరో స‌క్సెస్‌ఫుల్ ఫిల్మ్‌గా నిలిచింది. అయితే సినిమా స‌క్సెస్ కు సమాంతరంగా జాన్వీ క్యారెక్ట‌రైజేష‌న్‌పై జరిగిన చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అదా శర్మ చేసిన వ్యాఖ్యలు కేవలం పెద్ది వివాదానికే కాకుండా, ఫ్యూచ‌ర్ లో భారతీయ సినిమాల్లో పాత్రల రూపకల్పన, కథల ఎంపిక, సామాజిక బాధ్యతలపై కూడా కొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.