వారే నా జీవితాన్ని నాశనం చేశారు -ఊర్వశి
ఊర్వశి మాట్లాడుతూ.. "మనోజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి అత్తగారింట్లో అడుగు పెట్టాను. అయితే అక్కడి పరిస్థితులు నన్ను పూర్తిగా భయాందోళనకు గురిచేసాయి.
By: Madhu Reddy | 16 Dec 2025 1:12 PM ISTసినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు ఒక్కొక్కసారి అఘమ్య గోచరంగా అనిపిస్తాయి. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటే.. మరి కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇంకొంతమంది వందల సినిమాలలో బహు భాషా చిత్రాలలో నటించి.. భారీ పాపులారిటీ దక్కించుకున్న వారు.. వ్యక్తిగతంగా నరకయాతన అనుభవించిన రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అత్తింటివారే తన జీవితాన్ని నాశనం చేశారు అంటూ ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు తమ బాధను వ్యక్తపరచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ నటి ఊర్వశి కూడా వచ్చి చేరింది.
తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటించి తన అద్భుతమైన కామెడీ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఊర్వశి.. తన సినీ కెరియర్లో సుమారుగా 350కి పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2000 సంవత్సరంలో ప్రముఖ నటుడు మనోజ్ కె జయన్ ను వివాహం చేసుకోగా.. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు జన్మించింది. అయితే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో 2008లో విడాకులు తీసుకున్నారు. ఇక 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు సంతానం. ఈ మధ్యకాలంలో ఈయన దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే తన మొదటి భర్తతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? అనే విషయంపై స్పందించింది ఊర్వశి.
ఊర్వశి మాట్లాడుతూ.. "మనోజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి అత్తగారింట్లో అడుగు పెట్టాను. అయితే అక్కడి పరిస్థితులు నన్ను పూర్తిగా భయాందోళనకు గురిచేసాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో వాళ్ళందరి ఆధునిక జీవన విధానం నన్ను ఊపిరాడనివ్వకుండా చేసింది..తల్లి పిల్ల అని తేడా లేకుండా సాయంత్రం అవ్వగానే అందరూ ఒకచోట చేరి మందు తాగేవారు. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఇమడగలనా అనే అనుమానం కలిగింది. ముఖ్యంగా వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మధ్య ఉండడానికి అడ్జస్ట్ అవ్వడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇక ఆ తర్వాత వారి పద్ధతులు నేర్చుకోవాల్సి వచ్చింది. వాళ్లలాగే నేను కూడా షూటింగ్ కి వెళ్లడం.. ఇంటికి రాగానే వాళ్లతో కలిసి కూర్చొని మందు కొట్టడం ఇదే పని.. నన్ను నేను కోల్పోయాను. అప్పటికే ఇంటి పోషణ బాధ్యత నా భుజాలపై పడింది.
ఇష్టం లేని పనులను కూడా బలవంతంగా చేయాల్సి వచ్చేది. నా అభిప్రాయాలతో వారికి పని లేదు. క్రమంగా గొడవలు జరిగేవి. కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండి నిద్ర మానేసి మందు తాగుతూ నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ముఖ్యంగా నా మొదటి భర్త, వారి కుటుంబ సభ్యుల వల్లే నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక దాన్నుంచి బయటపడడానికి నా స్నేహితులు నాకు అండగా నిలిచారు." అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఊర్వశి. మొత్తానికైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అత్తారింట్లో సఖ్యత లేక అక్కడి ఆధునిక పద్ధతుల కారణంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నా.. అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ప్రస్తుతం మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె నయనతార లీడ్ రోల్ పోషిస్తున్న మూకుత్తి అమ్మన్ 2 సినిమాలో నటిస్తోంది.
