రిటైర్మెంట్ ను ప్రకటించిన సీనియర్ నటి
మామూలుగా రిటైర్మెంట్ అంటే ఏదైనా ఉద్యోగాల్లోనే ఉంటాయి తప్పించి సినీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది దాదాపు ఉండదు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 6:21 PM ISTమామూలుగా రిటైర్మెంట్ అంటే ఏదైనా ఉద్యోగాల్లోనే ఉంటాయి తప్పించి సినీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది దాదాపు ఉండదు. వయసు పెరిగే కొద్దీ, అవకాశాలు తగ్గడం చేతనో లేదంటే మరే కారణంతో అయినా సినిమాలు చేయడం మానేస్తారు తప్పించి రిటైర్మెంట్ అనే మాట వినడం చాలా అరుదు. అలాంటి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడో నటి రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
300కి పైగా సినిమాల్లో నటించిన తులసి
ప్రముఖ నటి, పలు సినిమాల్లో తల్లి పాత్రలతో మెప్పించిన తులసి తన సినీ ప్రస్థానానికి ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారు. ఈ ఇయర్ డిసెంబర్ 31వ తేదీతో తాను యాక్టింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల వయసు నుంచే బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన తులసి తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో 300కి పైగా సినిమాలు చేశారు.
తల్లి పాత్రలతో మెప్పించిన తులసి
కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు పొందిన తులిసి మధ్యలో కన్నడ డైరెక్టర్ శివమణిని పెళ్లి చేసుకుని కొంత కాలం పాటూ యాక్టింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో ఎంతో మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించి ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ ను దక్కించుకున్నారు.
డిసెంబర్ 31న రిటైర్మెంట్
తులసి గత కొన్నేళ్లుగా సినిమాలను తగ్గించుకుంటూ వస్తున్నప్పటికీ అక్కడా, ఇక్కడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎఫ్3లో వెంకటేష్ కు సవతి తల్లిగా కనిపించి మెప్పించిన తులసి, ప్రభాస్ సినిమాల్లో కూడా నటించారు. ఆమె నటించిన రీసెంట్ సినిమాలు పెద్దగా హిట్ అవకపోయినప్పటికీ ఆమె క్రేజ్ అంతే ఉంది. అయితే కొన్నాళ్లుగా సినిమాలను తగ్గించి సాయి బాబాపై భక్తిని పెంచుకున్న తులసి ఇప్పుడు తన ప్రతీ పనినీ ఆ భక్తితోనే ముడి పెడుతున్నారు. రిటైర్మెంట్ గురించి తన ఇన్‌స్టాలో హ్యాపీ రిటైర్మెంట్ అని రాసి ఉన్న ఓ గ్రీటింగ్ కార్డును పోస్ట్ చేస్తూ, ఈ డిసెంబర్ 31న షిర్డీ వెళ్తున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని, రిటైర్మెంట్ తర్వాత సాయి బాబాకు సేవ చేసుకుంటూ బతికేస్తానని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు ఆమెకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
