Begin typing your search above and press return to search.

నిజ జీవిత పాత్ర‌లో త‌మ‌న్నా ట్ర‌బుల్స్

నిజ జీవిత పాత్ర‌ల్లో న‌టించాలంటే చాలా స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. నిజ క‌థ‌లు, నిజ జీవిత‌ పాత్ర‌ల‌కు ప్ర‌త్యేకించి అభిమానులు ఉంటారు.

By:  Sivaji Kontham   |   30 Nov 2025 10:43 AM IST
నిజ జీవిత పాత్ర‌లో త‌మ‌న్నా ట్ర‌బుల్స్
X

నిజ జీవిత పాత్ర‌ల్లో న‌టించాలంటే చాలా స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. నిజ క‌థ‌లు, నిజ జీవిత‌ పాత్ర‌ల‌కు ప్ర‌త్యేకించి అభిమానులు ఉంటారు. వారిని సంతృప్తి ప‌రిచేలా తార‌లు న‌టించి మెప్పించాల్సి ఉంటుంది. దానికోసం చాలా క‌స‌ర‌త్తు చేయాలి. అయితే ఇప్పుడు నిజ జీవిత పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌మ‌న్నా తాను ఎలాంటి స‌వాల్ కి అయినా సిద్ధ‌మేన‌ని పేర్కొంది.

గ‌ల్లీబోయ్ ఫేం సిద్ధాంత్ చ‌తుర్వేది ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాకు అభిజీత్ దేశ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు వి శాంతారామ్ జీవ‌త‌క‌థ‌తో ఇది తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి `చిత్రపతి వి శాంతారామ్` అని పేరు పెట్టారు. ఇందులో ప్ర‌తి ఫ్రేమ్ లో త‌మ‌న్నా త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి ఆస్కారం ఉంది.

సిద్ధాంత్- త‌మ‌న్నా ఇద్ద‌రూ నిజ జీవిత పాత్ర‌ల‌లో క‌నిపిస్తారు. త‌మ‌న్నా పాత్ర క‌థ‌నాన్ని న‌డిపించే కీలకమైన పాత్ర. ఇది నిజంగా సవాలుతో కూడుకున్న పాత్ర‌. ప్రేక్షకులు ఆమెను కొత్త కోణంలో చూడగలుగుతారు కాబట్టి తమన్నా కూడా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రం మరాఠా, హిందీలోను రూపొంద‌నుంది. అభిజీత్ గ‌తంలో డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ (2018) అనే బ‌యోపిక్ ని రూపొందించారు. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ మరాఠీ చిత్రం `నటసామ్రాట్` (2016)కి అత‌డు ద‌ర్శ‌కుడు. టేబుల్ నెం 21 (2013), వజీర్ (2016), బ్రీత్ (2018) వంటి హిందీ సినిమాల‌కు అత‌డు ర‌చ‌యిత‌గా ప‌ని చేసారు.

శాంతారామ్ సేవ‌లు అన‌న్య సామాన్యం:

భారతీయ చిత్ర పరిశ్రమకు వి. శాంతారామ్ అందించిన సేవలు అపారమైనవి. ఈ చిత్రంతో యువతరం దాని గురించి నేర్చుకుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు. కొల్హాపూర్‌లో కడు పేదరికంలో జన్మించిన ఈ వ్యక్తి, పూణేలోని బాబూరావు పెయింటర్ వ‌ద్ద ప‌ని చేస్తూ, ఫిలింమేకింగ్ లో మెళ‌కువ‌లు నేర్చుకున్నాడు. అటుపై జ‌న‌క్ జ‌న‌క్ జ‌న‌క్ పాల్ బాజ్ (1955), దో ఆంఖేన్ బరా హాత్ (1957) వంటి చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో మరపురాని ముద్రను వేసాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఆయన ఒక ట్రెండ్‌సెట్టర్ ఎలా అయ్యాడో చెబుతుంది. ఈ బ‌యోపిక్ జ్ఞానోద‌యం క‌లగ‌జేయ‌డంలోనే కాదు.. ఎంతో వినోదాత్మ‌కంగా, నాట‌కీయంగాను ఉంటుంద‌ని చెబుతున్నారు.