₹4.69 కోట్లతో రష్మిక నెం.1
హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Ramesh Palla | 8 Jan 2026 3:51 PM ISTహీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కించుకుని, ఇంకా పలు తెలుగు సినిమాలు చేస్తోంది. మరో వైపు తమిళ సినిమాలు వరుసగా చేస్తూనే ఉంది. ఇక సొంత భాష అయిన కన్నడంలోనూ ఈమె సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు బాలీవుడ్‌లో ఆగకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అందుకే పాన్ ఇండియా రేంజ్‌లో ఈమెను స్టార్ హీరోయిన్ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు పిలుచుకునే ఈ అమ్మడు తాజాగా నెం.1 స్థానంలో నిలిచింది. హీరోయిన్‌గా కాకుండా పన్ను చెల్లించే విషయంలో ఈమె నెం.1 గా నిలిచి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా కుటుంబంకు చెందిన వ్యాపారాల్లోనూ భాగస్వామ్యం ఉన్న కారణంగా రష్మిక అత్యధిక పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్న నెం.1
ఒక జాతీయ మీడియా సంస్థ కథనం అనుసారంగా రష్మిక మందన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలకు కలిపి ఏకంగా ₹4.69 కోట్ల పన్ను చెల్లించింది. కన్నడకు చెందిన హీరోయిన్స్ ఈ స్థాయిలో పన్ను చెల్లించడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పైగా రష్మిక సొంత జిల్లా అయిన కొడగు లో పన్ను చెల్లించిన వారు అందరితో పోల్చితే అత్యధిక పన్ను చెల్లింపు దారుగా రష్మిక నిలిచి నెం.1 స్థానంను దక్కించుకుంది. హీరోయిన్‌గా ఆమె చేస్తున్న వరుస సినిమాలకు కోటాను కోట్ల పారితోషికం అందుకుంటూ ఉంది. పైగా ఈమె ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయడం వల్ల, లాభాల్లో వాటాను సైతం తీసుకుందనే వార్తలు వచ్చాయి. దాంతో ఆమె పారితోషికం అత్యధికంగా అంది ఉంటుంది అనేది చాలా మంది మాట. అందుకే ఈమె తన ఆదాయంకు తగ్గట్లుగానే భారీ మొత్తంలో పన్నును చెల్లించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో వచ్చిన..
రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ ఫలితాన్ని పక్కన పెడితే ఒక మంచి డీసెంట్ ఫిల్మ్‌గా, ఆలోచింపజేసే విధంగా ఉంది అంటూ రివ్యూలు దక్కించుకుంది. మంచి సినిమాలో నటించావు అంటూ చాలా మంది రష్మిక మందన్న ను అభినందించారని తెలుస్తోంది. రష్మిక గత ఏడాదిలో ఏకంగా ఛావా, సికిందర్, కుబేరా, థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సికిందర్ మినహా మిగిలిన అన్ని సినిమాలు ఈమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందుకే గత ఏడాది ఆమెకు చాలా కలిసి వచ్చిందని అంటారు. ఇక ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగులో మైసా అనే సినిమాతో ఈమె పవర్ ఫుల్ పాత్ర తో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నాయి.
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న పెళ్లి
ఇక రష్మిక గత కొంత కాలంగా హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వార్తలు జోరుగా వస్తున్నప్పటికీ కేవలం నవ్వుతూ సమాధానం చెబుతూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ వచ్చింది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహ నిశ్చితార్థం పూర్తి అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అతి త్వరలోనే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే రష్మిక సినిమాలను ఎక్కువగా కమిట్ కావడం లేదు అని చాలా మంది అంటున్నారు. ఆ మధ్య ఒక పెద్ద ఫిల్మ్ మేకర్ స్టార్ హీరో సినిమా కథను పట్టుకుని రష్మిక మందన్న వద్దకు వెళ్లాడట. సున్నితంగా ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించిందని అంటున్నారు. అందుకు కారణం ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలకు ఆమె చిన్న బ్రేక్ ఇచ్చే యోచనలో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
