Begin typing your search above and press return to search.

మగాళ్ళను కుక్కలతో పోల్చిన ప్రముఖ నటి.. అసలేమైందంటే?

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన అనవసరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా చేసి చిక్కుల్లో ఇరుక్కుంది.

By:  Madhu Reddy   |   9 Jan 2026 12:58 AM IST
మగాళ్ళను కుక్కలతో పోల్చిన ప్రముఖ నటి.. అసలేమైందంటే?
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు తెలిసి తెలియక చేసే కామెంట్లకు సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతమంది తమ అభిప్రాయాలను చెప్పినా సరే అది వివాదంగా మారి భారీ స్థాయిలో వారిపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

ఇంకొంతమంది తమకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకొని చిక్కుల్లో పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన అనవసరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. ముఖ్యంగా మగవారిని కుక్కలతో సమానంగా పోల్చుతూ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రమ్య తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో కూడా నటించి మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. "శాండిల్ వుడ్ క్వీన్" గా అభిమానుల చేత పిలువబడుతున్న ఈమె.. తొలిసారి కన్నడ చిత్రం 'అభి' ద్వారా 2003లో సినీ రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది తెలుగులో అభిమన్యు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సైరా భాను అనే పాత్రతో మంచి స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఆ తర్వాత నేరుగా ఈమె తెలుగు సినిమాలలో నటించలేదు. కానీ తమిళ్, కన్నడ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్య రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేసింది.

కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ లోకసభలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసింది. అలా ఒకవైపు సినిమాల ద్వారా.. ఇటు రాజకీయ రంగంలో కూడా సత్తా చాటిన ఈమె. అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై , సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మగాళ్ళని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తూ ప్రాణాలు కూడా హరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య కాస్త సుప్రీంకోర్టు వెళ్ళింది. దీనిపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు.." వీధుల్లో తిరిగే కుక్కలలో ఏది కరుస్తుందో? ఏది కరవదో ? తెలియదు కాబట్టి అందుకే వీటిని తీసుకెళ్లి ప్రత్యేక కేంద్రాలలో ఉంచాలి" అంటూ తీర్పునిచ్చింది.

అయితే ఈ తీర్పుపై రమ్య సోషల్ మీడియాలో స్పందిస్తూ.." మగవారి మైండ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ముందుగా చదవలేము. వాళ్ళు ఎప్పుడు అత్యాచారాలు చేస్తారో ? ఎప్పుడు హత్యలు చేస్తారో తెలియదు కాబట్టి మగవాళ్ళందర్నీ కూడా ఇలాగే జైల్లో పెడతారా?" అంటూ రాసుకుంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. మగాళ్ళను కుక్కలతో పోల్చడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రమ్య ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.