బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ మరో హీరోయిన్.. ఆ జాబితాలో ఇంకెంతమందో?
ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను అని అభిమానులతో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది .
By: Madhu Reddy | 5 March 2026 12:09 PM ISTసినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలు ఎంత లగ్జరీగా బయటకు కనిపించినా.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సోషల్ మీడియా రూమర్స్ అయితే.. మరొకవైపు తమ ఆరోగ్య విషయంలో లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో కొంతమంది తీవ్ర మానసిక వేదనకు గురైతే.. మరి కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు. అలా సెలబ్రిటీలను వెంటాడుతున్న మహమ్మారి వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఇప్పటికే చాలామంది వివిధ క్యాన్సర్ రకాలతో బాధపడగా.. ఇప్పుడు మరి కొంతమంది హీరోయిన్స్ ఏకంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ తమ ఆవేదనను అభిమానులతో పంచుకుంటున్నారు.
తొలి స్టేజ్ లోనే గుర్తించాను అంటున్న ప్రముఖ బ్యూటీ..
ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను అని అభిమానులతో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది . ఆమె ఎవరో కాదు సేక్రేడ్ గేమ్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న రాజశ్రీ దేశ్ పాండే. తనకు గ్రేడ్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, అదృష్టవశాత్తు సాధారణ వైద్య పరీక్షల సమయంలోనే ఈ విషయం బయటపడిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. ఇకపోతే ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక పరీక్షలు, శస్త్ర చికిత్సలు జరిగినప్పటికీ తన కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానుల మద్దతు తనకు మరింత బలాన్ని ఇచ్చాయని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపింది.
ఇండియన్ సెలబ్రిటీల నుండి గ్లోబల్ సెలబ్రిటీల వరకు..
ఇకపోతే ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ సెలబ్రిటీల జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజశ్రీ దేశ్ పాండే తో పాటు ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడ్డ సెలబ్రిటీల విషయానికి వస్తే.. 2024లో స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు హీనా ఖాన్ అభిమానులతో స్వయంగా ప్రకటించింది. 2018లో మెటా స్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడ్డ సోనాలి బింద్రే న్యూయార్క్ లో చికిత్స పొంది ఆ వ్యాధి నుండి బయటపడింది. వీరితో పాటు మహిమా చౌదరి తాహిరా కశ్యప్ ఖురానా, ముంతాజ్ అస్కారి మధ్వాని, అరుణ ఇరానీ, హంసానందిని తదితరులు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఒక్కొక్కరిగా ఈ వ్యాధి నుండి బయటపడ్డారు. ఇక మన ఇండియన్ నటీమణులే కాదు అంతర్జాతీయ నటీమణులు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడారు. అందులో ఒలివియా మున్, బార్బరా మోరి, డేనియల్ ఫిషెల్ తదితరులు ఈ క్యాన్సర్ బారిన పడి ధైర్యంగా ఈ క్యాన్సర్ ను జయించి మళ్లీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
మానసిక ధైర్యమే వ్యాధి నయానికి తొలిమెట్టు..
ఏది ఏమైనా ఇలా క్యాన్సర్ వచ్చినప్పుడు మానసిక వేదనను అనుభవించకుండా ధైర్యంగా చికిత్సకు సహకరించి మనశ్శాంతిని పొందగలిగితే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులను అయినా సరే ఇట్టే జయించవచ్చు అని ఈ హీరోయిన్స్ నిరోపించారు. ఇలా సెలబ్రిటీలు వెండితెరపై నవ్వులు చిందించినా.. తెర వెనుక వారు పడే కష్టం వర్ణనాతీతం. సెలబ్రిటీలు ఇప్పటికైనా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి కానీ తమ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మహమ్మారి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
