బోర్డర్ దాటాలంటే మాత్రం నో అనేస్తా!
అందాల రాశీఖన్నా టాలీవుడ్, కోలీవుడ్ ప్రయాణం ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 29 Nov 2025 1:09 PM ISTఅందాల రాశీఖన్నా టాలీవుడ్, కోలీవుడ్ ప్రయాణం ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. రాశీఖన్నాకి వచ్చినన్నీ అవకాశాలు మరే నటికి రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా రెండు భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. మీడియం హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అయింది. అందం, అభినయం అనే అర్హతలు మాత్రమే అమ్మడికి అవకాశాలు కల్పించాయి. నటిగా మాత్రం ఏ సినిమాలోనూ తనదైన ముద్ర వేసింది లేదు. మరి వాటి ఫలితాల సంగతేంటి? అంటే పని చేయడం వరకే తప్ప ఫలితం మాత్రం ఆశీంచొద్దు అన్నట్లే సాగింది.
అక్కడ కొత్తగా ప్లాన్:
అయితే ఇవన్నీ కమర్శియల్ చిత్రాలు మాత్రమే. నటనకు ఆస్కారం ఉన్నవి కొన్ని చిత్రాలే. కానీ వాటిలోనూ తన మార్క్ వేయలేకపోయింది. అయితే ఈ వాస్తవాన్ని రాశీఖన్నా చాలా ఆలస్యంగా గమనించింది. తనలో రియలైజేషన్ ఇప్పుడు మొదలైంది. ఈ నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానంటోంది. దక్షిణాదికి భిన్నంగా బాలీవుడ్ లో కెరీర్ బిల్డ్ చేసుకుంటానంది. కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు తప్ప? కమర్శియల్ పాత్రలు పోషించనుంది. ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడనంటోంది.
సీన్ డిమాండ్ చేసిందంటే పనవ్వదు:
కథా బలమున్న చిత్రాలతోనే తనని తాను ప్రూవ్ చేసుకోగలనంటోంది. ఈ క్రమంలో వెండి తెరపై బోర్డర్ దాటి నటించాల్సి వస్తే మాత్రం నో చెబుతానంది. సీన్ డిమాండ్ చేసిందని హద్దులు దాటి నటించాలనే ప్రపోజల్ వస్తే గనుక అలాంటి అవకాశాలు తనకు వద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తానంది. నటిగా తాను మరీ అంతగా దిగజారి పని చేయాల్సిన అవసరం లేదంది. ప్రతీ నటికి ఓ కంపర్ట్ జోన్ ఉంటుందని, ఈ విషయంలో ఎవర్నీ జడ్జ్ చేయకూడదన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. `మద్రాస్ కేఫ్` అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లో పరిచయమైన రాశీఖన్నా అక్కడ కొనసాగలేదు.
బాలీవుడ్ లైనప్ ఇలా:
సౌత్ సినిమాలపై ఆసక్తితో ఇక్కడే పని చేసింది. ఆ తర్వాత మళ్లీ `యోధ` తో బాలీవుడ్ లో రీలాంచ్ అయింది. `ది సబర్మతి రిపోర్ట్`, `120 బహదూర్` లాంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో అమ్మడి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హిందీలో `బ్రిడ్జ్`, `తాల్కోన్ మెయిన్ ఏక్` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కొన్నికొత్త కథలు కూడా విందని..వాటికి త్వరలోనే సైన్ చేస్తుందని సమాచారం. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోంది. అమ్మడి రీసెంట్ రిలీజ్ మరో తెలుగు సినిమా `తెలుసు కదా` ఆశీంచిన ఫలితాలు సాధించలేదు.
